Friday, 15 September 2017

శ్రీ రమణమహర్షి

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -4.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

చిన్నతనం నుంచి వేంకటరామన్ కి ' తంగ కై'  ( గోల్డెన్ హ్యాండ్ ) అని పేరువచ్చింది.  ఇంటిలో   యేపని కావాలన్నా వాళ్ళ పిన్నిగారు తనచేతనే మొదలు పెట్టించేదనీ, తను యేపనిలోనైనా మొదట చెయ్యిపెడితే ఆ పని చటుక్కున అయిపోయేదని  రమణులే తరువాత అనేకసార్లు చెప్పారు.  

వేంకటరామన్ కి    ప్రతి శని ఆదివారాలలో  సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసిరావడం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది.   అంతేకాదు పసితనం నుంచి అరుణాచలం పేరు వింటే వొళ్ళు పులకించి పోయేది.  ఆ కొండనే సాక్షాత్తు శివస్వరూపంగా భావనచేసేవాడు.  అలా కాలం గడుస్తుండగా, మొట్ట మొదటిసారిగా   భక్తుల జీవితాలకు సంబంధించిన ' పెరియ పురాణం ' అనే పుస్తకం చదవడం తటస్థించింది, వెంకటరామన్ కి.   అంతే, అతనిలో యెక్కడో అప్పటిదాకా  నిద్రాణమైన ఆధ్యాత్మిక విత్తనం మొలకెత్తింది.   ఆహా !  పవిత్ర గ్రంధాలు వ్యక్తుల జీవనసరళినే మార్చేస్తాయి అనడానికి యింతకంటే ఉదాహరణ యేమివుంటుంది.

1896 జులై 15వతేది.  సాఫీగా నడుస్తున్న వెంకటరామన్ జీవితం పెద్దమలుపు తిరిగినరోజు.  అతని 16వ యేట, యేవిధమైన కఠినసాధనలూ, గురూపదేశం లేకుండా  అనిర్వచనీయమైన ' ఆత్మానుభూతి ' ని పొందాడు, వెంకటరామన్.   ఆయన జీవితంలోనే అపూర్వఘట్టం యిది.  ఆ అనుభూతి భగవానుని మాటలలోనే క్లుప్తంగా :
" నేనొకనాడు  నా పినతండ్రి గారి యింటి పైఅంతస్తున కూర్చుని వుండగా, మరణిస్తున్నానన్న   పెద్ద భయం నన్ను ఆవహించినది.   వెంటనే మరణదృశ్యము నాకు నేనే నటించితిని.  నా అవయములు సాచి బిగబట్టి శవము వలె పడుకొంటిని.  ఇప్పుడు ఈ శరీరమును కాల్చిన నేను ఏమైపోదును. నేను వుందునుకదా !  అట్లైనచో యీశరీరము నేనుకాదు కదా!  కావున నా ఆత్మ దేహమునకు అతీతమైనది.  దేహము మరణించును కానీ, దానికి అతీతమైన ఆత్మను మృత్యువు కబళింపలేదు  అని నాకు అర్ధమైనది.  ఈ సంఘటనకు పూర్వము నా ఆత్మపై నాకు అంత స్పష్టమైన అవగాహన లేదు. "

ఇదే కదా భగవద్గీత సారం.  అలా మృత్యు అనుభవంతో రమణుడు మృత్యుంజయుడై   నిలిచాడు.  కారణజన్ముడు కావడం వలననే యే అభ్యాసమూ లేకుండా యిట్టి ఆత్మబోధ భగవాన్ రమణునికి కలిగింది.

ఆత్మానుభూతి పొందిన తరువాత అతని జీవితం మారిపోయింది.   ఆకర్షణలు తొలగిపోయాయి.  వేదాంత విషయాలు ఆకర్షించాయి.  వ్యావహారిక లౌకికజీవితం పై  కాంక్ష తొలగిపోయింది.  ఉదాసీనంగా అనుబంధాలకు అతీతంగా వుండడం మొదలు పెట్టాడు.   ఏకాంతంలో కళ్ళుమూసుకుని  ధ్యానంలో గడిపేవాడు.  వినయం, సాదుస్వభావం, నిర్లిప్తత  అతనికి ఆభరణాలు అయ్యాయి.  ఆ వైరాగ్యంలో పరాభక్తిని పొందాడు రమణుడు.   మధుర మీనాక్షీ సుందరేశ్వరులు ఒకప్పుడు విగ్రహాలుగా కనిపించిన వారు, సజీవమూర్తులుగా కళ్ళకు గోచరించారు.  అందుచేత మాటిమాటికీ మీనాక్షీ ఆలయానికి పరుగెత్తేవారు.
గుడిలో యెక్కువసేపు గడిపేవారు.  విపరీతమైన ఆలోచనలతో తలనొప్పి వచ్చేది. 

ఈతని పరిస్థితి ఇంట్లోవారికి ఆందోళన కలిగించింది.  చూస్తూ వుండలేక అన్న నాగస్వామి,  ఎగతాళిగా  నీవు పెద్ద జ్ఞానివి లాగా అయినావు.  ఇక నీకెందుకు చదువు.  ఎక్కడికైనా పోరాదా ! అని మందలించేవాడు.  అన్నగారి మందలింపు ఈశ్వరుని పిలుపులాగా తోచింది వెంకటరామన్ కి.

స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...