Saturday, 16 September 2017

శ్రీ రమణుల ఆశీస్సులతో

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -5.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

ఎక్కడికైనా వెళ్ళమన్న అన్నగారి మందలింపుతో తనగమ్యం తెలుసుకునే ధోరణిలో  గాఢచింతన చేశాడు వేంకటరామన్.  తనలోనుండి తనప్రయత్నం లేకుండానే ' అరుణాచలం వెళ్ళు ' అని దిశానిర్దేశం చేసినట్లు అయింది.  ఆ అసంకల్పితభావనే ఈశ్వరానుగ్రహం.   వెంటనే గృహం వదిలే నిర్ణయం తీసుకోవడమూ, అన్నగారితో తాను స్కూలులో క్లాసుకి హాజరు కావాలని చెప్పడమూ, అప్రయత్నంగా జరిగింది.  అన్నగారు పిన్ని నడిగి అయిదు రూపాయలు తీసుకుని కాలేజీలో నా ఫీజు కట్టమని చెప్పాడు.  సరే అని బుద్దిగా అన్నం తిని పినతల్లికి చెప్పి 5 రూపాయలు తీసుకుని  అరుణాచలం వెళ్ళే మార్గం అట్లాసులో చూసి తిరువన్నామలై వెళ్ళడానికి 3 రూపాయలు చాలునని అంచనా వేసుకుని,  2 రూపాయలు తిరిగి పెట్టెలో పెట్టివేశాడు, వేంకటరామన్.   అన్నగారికి  ' నేను నా తండ్రిని వెదుకుచు నా తండ్రి ఆజ్ఞానుసారము,  ఇక్కడనుండి బయలుదేరితిని. ఇది సత్కార్యమునకే.  కావున యెవరును యీ విషయమును గూర్చి చింతిచపనిలేదు.  నన్ను వెదకుటకు అనవసరమైన వ్యయ ప్రయాసలు చెయ్యవద్దు.  నీ కాలేజీ జీతము కట్టబడలేదు.  '  అని ఒక వుత్తరం వ్రాసి యింటి నుండి బయలుదేరాడు.

ఆ మానసిక సంనద్ధత, తన ప్రయాణం వలన యింట్లో వారు ఇబ్బంది పడకూదడను ఆలోచన యెంత మహత్తరం!

రైల్వే స్టేషనుకు చేరుకున్న వేంకటరామన్  రొజూ వేళప్రకారము వచ్చే ట్రైన్ తన కోసమే గంట ఆలస్యంగా రావడం కూడా ఈశ్వర ప్రేరితమే అనుకున్నాడు.  దిండివనానికి  టిక్కెట్టుతీసుకుని రైలుయెక్కి కూర్చుని వెంటనే ధ్యానంలోనికి వెళ్ళిపోయాడు.   చీకటిపడుతుండగా ప్రక్కనే కూర్చున్న మౌల్వీ సాయంతో దగ్గర దారి తెలుసుకుని దిండివనం  వెళ్ళే పనిలేకుండా విల్లుపురం నుంచి తిరువన్నామలై వెళ్లవచ్చని తెలుసు కున్నాడు.  కొద్దిసేపటి తరువాత తనతో తిరుక్కోయిలూరు వరకు వస్తానన్న మౌల్వీ కనిపించలేదు.  ఈ  అద్భుతాలన్నీ ఈశ్వర ప్రేరితాలే అని భావిస్తూ, తెల్లవారుఝామున 3 గం. విల్లుపురం లో దిగి మార్గం కోసం ఊరంతా తిరిగి అలసిపోయాడు వెంకట్రామన్.   ఆకలివేస్తుంటే పూటకూళ్ళ యింటికివెళ్లి భోజనం పెట్టమని అడిగాడు.  మధ్యాహ్నం దాకా ఆగమని వారు చెప్పడంతో అక్కడే ధ్యానంలో కూర్చున్నాడు.  వాళ్ళే యితనిని లేపి భోజనం పెట్టి డబ్బులివ్వబోగా తీసుకోలేదు.   ఇదీ  దైవానుగ్రహమే అని భావించి వేంకటరామన్ తన దగ్గర వున్న డబ్బులతో 'మాంబళంపట్టు'  చేరుకొని అక్కడనుండి పది మైళ్ళు కాలినడకన 'తిరువన్నామలై'  వైపుకు వెళ్ళేసరికి చీకటిపడింది. 
అప్పటికి వేంకటరామన్ ' అరయని నల్లూరు ' అనే గ్రామం చేరుకున్నాడు.  అది గొప్ప శివక్షేత్రము కావడమూ,  ఆప్రక్కనే కొండపై  'అతుల్యనాధేశ్వరుడు' కొలువై వుండడమూ యాద్రుచ్చికమా,  వెంకటరామన్  సంకల్పబలమా!  కాలమే నిర్ణయిస్తుంది.  అక్కడినుండి అరుణాచలం బాగా కనబడుతుంది.  ఎంతో  శ్రమపడి కొండెక్కిన వేంకటరామన్కి  అక్కడ యెవరూ  కనిపించలేదు.  కోవెల తలుపులు మూసి వున్నాయి.   పూజారి రానందున గుడి వెలుపల కూర్చున్నాడు వేంకటరామన్. 

స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...