శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -1.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
శ్రీ రమణుల ముత్తాతల కాలంలో ఒకసన్యాసి భిక్షకోసం రమణుల పూర్వీకుల యింటికి వచ్చాడు. వారి ముత్తాత చిరాగ్గా ఆ భిక్షకుని చూస్తూ " దున్నపోతులా వున్నావు. ఏదైనా పనిచేసుకోరాదా? " అని కేకలు వేశాడు. అయితే ఆ సన్యాసి కూడా అంతే కోపంతో " నీ వంశములో కూడా నాలాగే తరానికి వకరు సన్యాసియై యింటింటికీ వెళ్లి అడుక్కుందురు గాక! " అని శపించాడు. అప్పుడు ముత్తాత గారు ఆ భిక్షుకునికి నమస్కరించి " ఏమిటి ఈ విపరీత భావన. కనికరించండి " అని అడుగగా " మాకోపం తాటాకుమంట లాంటిది. కానీ మావాక్కు తిరుగులేనిది. అంతా మంచే జరుగుతుంది " అని వెళ్ళిపోయాడు.
అన్నట్లుగానే, మూడుతరాలు ఆశాపం కార్యరూపం దాల్చింది. భగవాన్ రమణుల తాతలలో వొకరు సన్యాసం స్వీకరించారు. ఆయనపేరు శివానందయోగి. రెండోతరంలో భగవాన్ పెదతండ్రి వెంకటేశ్వర్ 18 సం. లకే ప్రాపంచిక సుఖాలపై విరక్తుడయ్యాడు. తరువాత తరంలో మన రమణులు కూడా 16 సం.ల వయస్సులోనే యిల్లువదలి అరుణాచలం వెళ్ళిపోయారు.
ఆహా ! మహాత్ముల శాపాలు మానవ కల్యాణం కోసమే కదా! ఆ శాపమే, మానవాళికి రమణమహర్షి ద్వారా జీవిత సత్యాలని చెప్పి పునీతులని చేసింది. ఎందరినో ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపిస్తున్నది.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరికొంత రేపు....
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -2.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
అది 1879 డిసెంబరు, 29వ తేదీ. అర్ధరాత్రి దాటింది. ఇంగ్లీషు లెక్కల ప్రకారం 30 వ తేదీ వచ్చింది. ఒంటిగంట సమయం. ఆరోజు హిందువులకు పర్వదినం అయిన ఆరుద్రా దర్శనోత్సవం.
ప్రదేశం : తమిళనాడులో మదురై దగ్గర తిరుచ్చుళి గ్రామం. ఈ గ్రామమే ' త్రిశూలపురం ' అని స్కాందపురాణం లో పేర్కొనబడింది. ఆగ్రామంలో శ్రీ భూమినాధేశ్వరుని ఆలయంలో ఈశాన్యం వేపు వున్న ఓ ఇల్లు.
ఆ యింటిలో శ్రీ సుందరఅయ్యర్ గారి భార్య అళగమ్మ ఉదయం నుండి పురిటినొప్పులు పడుతున్నది. ఆమెకు బాసటగా ఆమె అత్తగారు, పొరుగింటి అంధస్త్రీ లక్ష్మీఅమ్మాళ్, మరికొందరు స్త్రీలు వున్నారు. అప్పుడే పునర్వసు నక్షత్రంతో చంద్రుడుకూడి కాంతులు వెదజల్లుతున్నాడు. శ్రీ భూమినాదేశ్వరుడు గ్రామం అంతా ఊరేగి, తన ఊరేగింపు ముగించుకుని ఆలయానికి చేరబోతూ, ఒక్క క్షణం ఆయింటి ముందు ఆగాడు. సరిగ్గా ఆసమయం లోనే, ఉదయం నుండి నొప్పులు పడుతున్న అళగమ్మ పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ భూమినాధేశ్వరుడు, తన ఊరేగింపు ముగించుకుని వచ్చి తన చల్లని దృష్టి ప్రసరింప చేయడం కోసమే, ఆమె ప్రసవం ఆగినట్లున్నది.
మనుమడు పుట్టినందుకు ఆమె అత్తగారు సంతోషింపక పోగా, తన కుమార్తెకుమారుడికి ఆడపిల్లని యిచ్చి మేనరికం చెయ్యలేక పోతున్నామే అని బాధపడింది. అయితే, ప్రక్కనే వున్న అంధమహిళ " మగబిడ్డ బంగారుముద్ద లాగా వెలిగిపోతున్నాడు. కాంతిపుంజంతో అవతారమూర్తి లాగా వున్నాడు. ఎందుకు ఏడుస్తావు. " అని వోదార్చింది. ఆశ్చర్యం. ఆ అంధురాలు, లక్ష్మీఅమ్మాళ్ కి యెలా ఆ కాంతిపుంజం దర్శనం అయింది. బాలుని రూపురేఖలు యెలా కనబడ్డాయి? తరువాత రోజుల్లో అజ్ఞాన అంధకారంలో నుంచి మనుష్యుల జీవితాలను వెలుగులోనికి తీసుకువచ్చే మహనీయుడు జన్మించాడని సంకేతమా? అంతే అయివుంటుంది. ఎందుకంటె, ఆ బాలుడే, ' భగవాన్ శ్రీ రమణమహర్షి ' నామంతో కలియుగ కుమార స్వామిగా ఆరాధింప బడినవాడే కదా!
సుందరఅయ్యరు గారు ఆబాలునికి తమ కులదైవమైన వేంకటేశ్వరుని పేరుపెట్టారు. కానీ, వేంకటేశ్వరుడు బడిలో ప్రవేశించిన తరువాత ' వెంకటరామన్ ' గా మారాడు. లక్ష్మణ్ అయ్యర్ అనే తెలుగు పండితుడు
' రమణుడు ' అనీ ' రమణీ ' అని ముద్దుగా పిలిచేవాడు. అదే కాలక్రమేణ స్థిరపడింది. ఆయన తెలుగు సాంప్రదాయాన్ని రమణుడికి అలవాటు చేశాడు. ఆ విధంగా రమణుడి ఎలిమెంటరీ విద్యాభ్యాసం జరుగుతుండగా, 8 సం. వయస్సులో ఆ బాలునికి తండ్రి శాస్త్రోక్తంగా ఉపనయనం చేశాడు.
స్వస్తి.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -3.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
రమణుడికి ఆంగ్లభాష నేర్పాలని తండ్రి సుందరం అయ్యరు కోరిక. అయితే తిరుచ్చుళి లో అలాంటి బడి లేక పోవడంతో 1891 లో మన వెంకటరామనుని దిండిగల్లులో వున్న తన పెద్దతమ్ముడు సుబ్బయ్యరు వద్దకు పంపాడు. అప్పటికే రమణుని అన్నగారు నాగస్వామి అక్కడే చదువుకుంటున్నాడు. రమణుడు మొదటిఫారంలో చేరాడు. రమణుడు ఏకసంధాగ్రాహి. అయితే చదువుపట్ల పెద్దఆసక్తి కనబరచేవాడు కాదు. విన్నదివిన్నట్లుగా వప్పగించేవాడు. కానీ శ్రద్ధలేదు. నిద్రలో అపరకుంభకర్ణునిలా వుండేవాడు. ఆ నిద్ర మొద్దునిద్రగా భావించలేము. అది రాబోయేకాలంలో కఠొరమైన ఆత్మానుభవానికి నాందిగా అనుకోవచ్చు. కొద్దిరోజుల్లోనే సుబ్బయ్యరు గారు దిండిగల్లు నుండి మధురకు మారారు. పినతండ్రి, అన్నగారితో పాటు మన వేంకటరామన్ కూడా మదురై చేరారు. అక్కడవున్న స్కాట్ మిడిల్ స్కూల్ లో రెండవ ఫారంలో చేరాడు.
కాలం మార్పులను తెస్తుందికదా! సుందరం అయ్యరు మధ్యవయస్కులుగా వుండగానే, అనగా 48వ యేటనే అనారోగ్యానికి గురి అయ్యి మరణించారు. ఆయన చనిపోయే నాటికి నలుగురుసంతానంలో పెద్దవాడు నాగస్వామికి 16 సం. రెండవవాడు వెంకటరామన్ కి 12 సం. మూడవవాడు నాగాసుందరానికి 6 ఏళ్ళు. ఆఖరిదైన ఆడపిల్ల అలువేలుమంగ యింకా పోత్తిళ్లలోనే వున్నది. అట్టిపరిస్థితులలో సుబ్బయ్యరు గారు అన్నగారి మొదటి యిద్దరుపిల్లలని మదురై లో వుంచుకుని తన భ్రాతృప్రేమ చాటుకున్నాడు. అదేవిధంగా మిగిలిన యిద్దరుపిల్లల భారం రెండవతమ్ముడు నెల్లియప్పయ్యర్ వహించాడు. అవీ ఆరోజుల్లో కటుంబవిలువలు. అన్నదమ్ములు కుటుంబ బాధ్యతలను తలకెత్తుకునె తీరు. ఈరోజులలో వూహకుకూడా అందనివి.
ఇంతజరిగినా, తండ్రిమరణం గానీ కుటుంబమార్పులు కానీ వెంకటరామన్ పై యేప్రభావం చూపలేదు. జీవితాన్ని ఉదాసీనంగా గడుపుతున్నాడు. అమెరికన్ మిడిల్ స్కూల్లో 4వ ఫారం లో చేరాడు. అయితే చదువునందు మాత్రం పెద్ద శ్రద్ధ కనబరచుట లేదు. ఆంగ్లము, గణితము అసలే పట్టలేదు. తమిళ వ్యాకరణం తమిళ శ్లోకాలు మాత్రం వింటే మర్చిపోయేవాడు కాదు. స్వతహాగా తెలివిగలవాడు అవడం వలన ఆసక్తి చూపకపోయినా అన్నిపరీక్షలలో ఉత్తీర్ణుడయ్యేవాడు.
వేంకటరామన్ మంచి కండపుష్టి కలవాడు. ఈ దారుధ్యమే తనకు దీర్ఘకాలం మౌననిష్టలో కూర్చునేందుకు దోహదపడింది అనిపిస్తుంది. అతని కండబలం చూసి అందరూ ముచ్చటపడేవారు. ఆటలపట్ల ఆసక్తి చూపించేవాడు. ఫుట్బాలుఆటలో మేటిగా వుండేవాడు. ప్రతీరోజు వైఖానదిలో స్నేహితులతో కలిసి ఈతలు కొట్టేవాడు. ఎండాకాలం తనూ, స్నేహితులతో కలిసి చెలమలు తవ్వి, వారు స్నానమాడి, గ్రామస్తులకు నీటి కొరత తీర్చేవారు. పినతల్లికి వంటలో, ఇంటిపనుల్లో సాయం చేసేవాడు. ఆమెకి మడీ ఆచారం ఎక్కువ కావడంతో తడిగోచీతో వంటింట్లోకి రమ్మంటే యిష్ట పడేవాడు కాదు.
ఆహా! కాలమహిమ. అట్టి తడిగోచీ ఇష్టపడని వేంకటరామన్ భవిష్యత్తులో శాశ్వతంగా గోచీ ( కౌపీనం ) తోనే జీవితం గడిపి యితరులకు వైరాగ్యమార్గం చూపించాడు.
స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -4.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
చిన్నతనం నుంచి వేంకటరామన్ కి ' తంగ కై' ( గోల్డెన్ హ్యాండ్ ) అని పేరువచ్చింది. ఇంటిలో యేపని కావాలన్నా వాళ్ళ పిన్నిగారు తనచేతనే మొదలు పెట్టించేదనీ, తను యేపనిలోనైనా మొదట చెయ్యిపెడితే ఆ పని చటుక్కున అయిపోయేదని రమణులే తరువాత అనేకసార్లు చెప్పారు.
వేంకటరామన్ కి ప్రతి శని ఆదివారాలలో సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసిరావడం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది. అంతేకాదు పసితనం నుంచి అరుణాచలం పేరు వింటే వొళ్ళు పులకించి పోయేది. ఆ కొండనే సాక్షాత్తు శివస్వరూపంగా భావనచేసేవాడు. అలా కాలం గడుస్తుండగా, మొట్ట మొదటిసారిగా భక్తుల జీవితాలకు సంబంధించిన ' పెరియ పురాణం ' అనే పుస్తకం చదవడం తటస్థించింది, వెంకటరామన్ కి. అంతే, అతనిలో యెక్కడో అప్పటిదాకా నిద్రాణమైన ఆధ్యాత్మిక విత్తనం మొలకెత్తింది. ఆహా ! పవిత్ర గ్రంధాలు వ్యక్తుల జీవనసరళినే మార్చేస్తాయి అనడానికి యింతకంటే ఉదాహరణ యేమివుంటుంది.
1896 జులై 15వతేది. సాఫీగా నడుస్తున్న వెంకటరామన్ జీవితం పెద్దమలుపు తిరిగినరోజు. అతని 16వ యేట, యేవిధమైన కఠినసాధనలూ, గురూపదేశం లేకుండా అనిర్వచనీయమైన ' ఆత్మానుభూతి ' ని పొందాడు, వెంకటరామన్. ఆయన జీవితంలోనే అపూర్వఘట్టం యిది. ఆ అనుభూతి భగవానుని మాటలలోనే క్లుప్తంగా :
" నేనొకనాడు నా పినతండ్రి గారి యింటి పైఅంతస్తున కూర్చుని వుండగా, మరణిస్తున్నానన్న పెద్ద భయం నన్ను ఆవహించినది. వెంటనే మరణదృశ్యము నాకు నేనే నటించితిని. నా అవయములు సాచి బిగబట్టి శవము వలె పడుకొంటిని. ఇప్పుడు ఈ శరీరమును కాల్చిన నేను ఏమైపోదును. నేను వుందునుకదా ! అట్లైనచో యీశరీరము నేనుకాదు కదా! కావున నా ఆత్మ దేహమునకు అతీతమైనది. దేహము మరణించును కానీ, దానికి అతీతమైన ఆత్మను మృత్యువు కబళింపలేదు అని నాకు అర్ధమైనది. ఈ సంఘటనకు పూర్వము నా ఆత్మపై నాకు అంత స్పష్టమైన అవగాహన లేదు. "
ఇదే కదా భగవద్గీత సారం. అలా మృత్యు అనుభవంతో రమణుడు మృత్యుంజయుడై నిలిచాడు. కారణజన్ముడు కావడం వలననే యే అభ్యాసమూ లేకుండా యిట్టి ఆత్మబోధ భగవాన్ రమణునికి కలిగింది.
ఆత్మానుభూతి పొందిన తరువాత అతని జీవితం మారిపోయింది. ఆకర్షణలు తొలగిపోయాయి. వేదాంత విషయాలు ఆకర్షించాయి. వ్యావహారిక లౌకికజీవితం పై కాంక్ష తొలగిపోయింది. ఉదాసీనంగా అనుబంధాలకు అతీతంగా వుండడం మొదలు పెట్టాడు. ఏకాంతంలో కళ్ళుమూసుకుని ధ్యానంలో గడిపేవాడు. వినయం, సాదుస్వభావం, నిర్లిప్తత అతనికి ఆభరణాలు అయ్యాయి. ఆ వైరాగ్యంలో పరాభక్తిని పొందాడు రమణుడు. మధుర మీనాక్షీ సుందరేశ్వరులు ఒకప్పుడు విగ్రహాలుగా కనిపించిన వారు, సజీవమూర్తులుగా కళ్ళకు గోచరించారు. అందుచేత మాటిమాటికీ మీనాక్షీ ఆలయానికి పరుగెత్తేవారు.
గుడిలో యెక్కువసేపు గడిపేవారు. విపరీతమైన ఆలోచనలతో తలనొప్పి వచ్చేది.
ఈతని పరిస్థితి ఇంట్లోవారికి ఆందోళన కలిగించింది. చూస్తూ వుండలేక అన్న నాగస్వామి, ఎగతాళిగా నీవు పెద్ద జ్ఞానివి లాగా అయినావు. ఇక నీకెందుకు చదువు. ఎక్కడికైనా పోరాదా ! అని మందలించేవాడు. అన్నగారి మందలింపు ఈశ్వరుని పిలుపులాగా తోచింది వెంకటరామన్ కి.

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -5.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
ఎక్కడికైనా వెళ్ళమన్న అన్నగారి మందలింపుతో తనగమ్యం తెలుసుకునే ధోరణిలో గాఢచింతన చేశాడు వేంకటరామన్. తనలోనుండి తనప్రయత్నం లేకుండానే ' అరుణాచలం వెళ్ళు ' అని దిశానిర్దేశం చేసినట్లు అయింది. ఆ అసంకల్పితభావనే ఈశ్వరానుగ్రహం. వెంటనే గృహం వదిలే నిర్ణయం తీసుకోవడమూ, అన్నగారితో తాను స్కూలులో క్లాసుకి హాజరు కావాలని చెప్పడమూ, అప్రయత్నంగా జరిగింది. అన్నగారు పిన్ని నడిగి అయిదు రూపాయలు తీసుకుని కాలేజీలో నా ఫీజు కట్టమని చెప్పాడు. సరే అని బుద్దిగా అన్నం తిని పినతల్లికి చెప్పి 5 రూపాయలు తీసుకుని అరుణాచలం వెళ్ళే మార్గం అట్లాసులో చూసి తిరువన్నామలై వెళ్ళడానికి 3 రూపాయలు చాలునని అంచనా వేసుకుని, 2 రూపాయలు తిరిగి పెట్టెలో పెట్టివేశాడు, వేంకటరామన్. అన్నగారికి ' నేను నా తండ్రిని వెదుకుచు నా తండ్రి ఆజ్ఞానుసారము, ఇక్కడనుండి బయలుదేరితిని. ఇది సత్కార్యమునకే. కావున యెవరును యీ విషయమును గూర్చి చింతిచపనిలేదు. నన్ను వెదకుటకు అనవసరమైన వ్యయ ప్రయాసలు చెయ్యవద్దు. నీ కాలేజీ జీతము కట్టబడలేదు. ' అని ఒక వుత్తరం వ్రాసి యింటి నుండి బయలుదేరాడు.
ఆ మానసిక సంనద్ధత, తన ప్రయాణం వలన యింట్లో వారు ఇబ్బంది పడకూదడను ఆలోచన యెంత మహత్తరం!
రైల్వే స్టేషనుకు చేరుకున్న వేంకటరామన్ రొజూ వేళప్రకారము వచ్చే ట్రైన్ తన కోసమే గంట ఆలస్యంగా రావడం కూడా ఈశ్వర ప్రేరితమే అనుకున్నాడు. దిండివనానికి టిక్కెట్టుతీసుకుని రైలుయెక్కి కూర్చుని వెంటనే ధ్యానంలోనికి వెళ్ళిపోయాడు. చీకటిపడుతుండగా ప్రక్కనే కూర్చున్న మౌల్వీ సాయంతో దగ్గర దారి తెలుసుకుని దిండివనం వెళ్ళే పనిలేకుండా విల్లుపురం నుంచి తిరువన్నామలై వెళ్లవచ్చని తెలుసు కున్నాడు. కొద్దిసేపటి తరువాత తనతో తిరుక్కోయిలూరు వరకు వస్తానన్న మౌల్వీ కనిపించలేదు. ఈ అద్భుతాలన్నీ ఈశ్వర ప్రేరితాలే అని భావిస్తూ, తెల్లవారుఝామున 3 గం. విల్లుపురం లో దిగి మార్గం కోసం ఊరంతా తిరిగి అలసిపోయాడు వెంకట్రామన్. ఆకలివేస్తుంటే పూటకూళ్ళ యింటికివెళ్లి భోజనం పెట్టమని అడిగాడు. మధ్యాహ్నం దాకా ఆగమని వారు చెప్పడంతో అక్కడే ధ్యానంలో కూర్చున్నాడు. వాళ్ళే యితనిని లేపి భోజనం పెట్టి డబ్బులివ్వబోగా తీసుకోలేదు. ఇదీ దైవానుగ్రహమే అని భావించి వేంకటరామన్ తన దగ్గర వున్న డబ్బులతో 'మాంబళంపట్టు' చేరుకొని అక్కడనుండి పది మైళ్ళు కాలినడకన 'తిరువన్నామలై' వైపుకు వెళ్ళేసరికి చీకటిపడింది.
అప్పటికి వేంకటరామన్ ' అరయని నల్లూరు ' అనే గ్రామం చేరుకున్నాడు. అది గొప్ప శివక్షేత్రము కావడమూ, ఆప్రక్కనే కొండపై 'అతుల్యనాధేశ్వరుడు' కొలువై వుండడమూ యాద్రుచ్చికమా, వెంకటరామన్ సంకల్పబలమా! కాలమే నిర్ణయిస్తుంది. అక్కడినుండి అరుణాచలం బాగా కనబడుతుంది. ఎంతో శ్రమపడి కొండెక్కిన వేంకటరామన్కి అక్కడ యెవరూ కనిపించలేదు. కోవెల తలుపులు మూసి వున్నాయి. పూజారి రానందున గుడి వెలుపల కూర్చున్నాడు వేంకటరామన్.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -6.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
అతుల్యనాధేశ్వరుని కోవెల వెలుపల వెంకటరామన్ కూర్చున్నాడు, పూజారికై యెదురుచూస్తూ..
కొంతసేపటికి పూజారివచ్చి పూజ ప్రారంభించాడు. వేంకటరామన్ లోపలికివెళ్లి మండపం దగ్గర కూర్చుని ధ్యానం మొదలుపెట్టాడు. ఉన్నట్లుంది ఏదో గొప్ప వెలుతురు తనదేహాన్ని కప్పినట్లుగా అనిపించసాగింది. కళ్ళు తెరచి నాలుగుడుగులు వేస్తే ఇంకెక్కడా ఆ వెలుగు కనిపించలేదు. వెంటనే యధాస్థానానికి వచ్చి ద్య్హానంలో నిమగ్నుడైనాడు వేంకటరామన్. ఇక్కడ చెప్పుకో వలసిన అద్భుతమైన విషయం యేమిటంటే యిదే ప్రదేశంలో 16 సం. వయస్సులోనే జ్ఞానసంబంధమూర్తి అనబడే గొప్ప శివభక్తునికి కూడా యిక్కడే జ్యోతి దర్శనం అయ్యింది. ఓం శ్రీ అతుల్యనాధేశ్వరాయనమ :
పూజారి పూజ ముగించుకుని వేంకటరామన్ని లేపి గుడితలుపులు మూసి వేరేగుడికి పూజ చెయ్యడానికి వెళ్ళాడు. వేంకటరామన్ కూడా ఆయనను అనుసరించి అక్కడా పూజ జరుగుతున్నంత సేపు ధ్యానంలో వుండిపోయాడు. మళ్ళీ పూజారి అతనినిలేపాడు. ఆకలి అవుతున్నది ప్రసాదం పెట్టమని వేంకటరామన్ పదేపదే అడిగినా కఠినహృదయుడైన పూజారి, ప్రసాదం అతనికి యివ్వలేదు. అతని పరస్థితి చూసి, అక్కడి నాదస్వరబృందంలో వాద్యగాళ్ళలో ఒకరి మనసు కరిగి తనప్రసాదం అతనికి ఇచ్చివేశాడు. తరువాతి కాలంలో ఆపూజారి యెంత వగచాడో, ఆ వాద్యగాడు యెంత మురిశాడో, రమణునికి ప్రసాదం పెట్టనందుకు, రమణునికి ప్రసాదం పంచినందుకు.
ఆప్రసాదం తీసుకుని కొండదిగి ఒక యింటిముందు ఆగి నీరు యివ్వమని అడిగాడు వేంకటరామన్. అంతలో యేమయ్యిందో తెలీదు. శరీరం వశంతప్పింది. బాహ్యస్మృతి పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి కొంత దూరంలో పడి వున్నాడు. ప్రసాదం చెల్లాచెదురు అయివుంది. చుట్టూ జనం మూగి వున్నారు. క్రింద పడిన ప్రసాదాన్నే కొంచెం తిని నీరుత్రాగాడు. ఆ రాత్రి అక్కడే ఇసుకమీద నిద్రపోయాడు వేంకటరామన్.
మర్నాడు గోకులాష్టమి. 1896 ఆగష్టు 31వ తేదీ. వెంకటరామన్, పూర్తిగా అలిసిపోయి వున్నాడు. తిరువన్నామలై ఇంకా 20 మైళ్ళ దూరం వున్నది. చేతిలో చిల్లిగవ్వ లేదు. చెవులకి వున్న కెంపుల పోగులు తప్ప వంటిమీద ఖరీదైన వస్తువులు కూడా లేవు. కడుపు ఆకలితో మండిపోతోంది. ఒక బ్రాహ్మణ వీధిలో ముత్తుకృష్ణ భాగవతార్ అనే ఆయన యింటిముందు ఆగి భోజనం పెట్టమని అడిగాడు. ఆయన సోదరి, జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడే తమ యింటికివచ్చాడని భావించి వంటచెయ్యడం మొదలుపెట్టింది. వేంకటరామన్ పరిస్థితి చూసి, వంట అయ్యేవరకు వుండలేడని భావించి ముందురోజు మిగిలిన చలిది అన్నం తినిపించింది. వంట పూర్తిఅయిన తరువాత పిండివంటలతో భోజనంపెట్టి, శ్రీకృష్ణునికి నైవేద్యం పెట్టడం కూడా మర్చిపోయి, వేంకటరామన్ కు రాత్రి భోజనానికి మూట కట్టి ఇచ్చింది. ఆమె చేసుకున్న సుకృతం మాటలలో వర్ణించగలమా! ఆమె సేవకు వెలగట్టగలమా!!
మిగిలిన ప్రయాణానికి తన కెంపుల చెవి కమ్మలు 4 రూ. లకు ఆ ఇంటి భాగవతారు వద్ద తాకట్టుపెట్టి ఆయన యిచ్చిన తాకట్టు చీటీని ఆయింటిబయటే చించివేశాడు, వున్న ఆఒక్క బంధాన్నీ వదిలించు కున్నట్లుగా.
ఆమె ఇచ్చిన మూట తీసుకుని రైలులో అరుణాచలానికి బయలుదేరి 1896 సెప్టెంబరు 1వ తేదీ నాడు అరుణాచలంలో అడుగుబెట్టాడు వెంకటరామన్.
అడుగుపెట్టీ పెట్టగానే, వేంకటరామన్ అపరిమితమైన ఆనందంతో వూగిపోతున్నాడు. వెంటనే అరుణా చలేశుని ఆలయానికి పరిగెత్తాడు. బిడ్డకోసం యెదురుచూస్తున్నట్లుగా ఆ అరుణాచలేశ్వరుని గుడి ద్వారాలన్నీ తెరిచేవున్నాయి, గర్భగుడితో సహా.
వేంకటరామన్ దివ్యావేశంతో గర్భగుడిలోనికి ప్రవేశించి తండ్రిని చేరుకున్నాడు. ఉబికివస్తున్న ఆనంద బాష్పాలతో అరుణాచలేశ్వరుని అభిషేకిస్తూ " తండ్రీ నీ ఆజ్ఞమేరకు వచ్చాను." అని విన్నవించుకున్నాడు. ఆహా ! ఏమిదృశ్యము. ఆతండ్రి యీబిడ్డకు ఏమి మౌనోపదేశం చేశాడో తెలియదు. అంతవరకూ వేంకటరామన్ అనుభవిస్తున్న అశాంతి అనేమంట చల్లారిపోయింది అమృతం చిలకరించినట్లయ్యింది. వేంకటరామన్ మామూలుభక్తులలా చేతులెత్తి నమస్కరించలేదు. గుడికి ప్రదక్షిణాలు చెయ్యలేదు. సాష్టాంగపడి మ్రొక్కలేదు. మామూలుగా తండ్రికి బిడ్డ యివన్నీ చెయ్యవలసిన అవసరం లేదుకదా! బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగలించుకున్నట్లు అరుణాచలేశుని పెనవేసుకున్నాడు, యింక నీవేదిక్కని. రేపటి గురించి చింతలేని పరిపూర్ణ శరణాగతి ! యెంత మనోహర దృశ్యం !!

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -7.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
అరుణాచలేశునిచే అక్కున చేర్చుకోబడిన వేంకటరామన్, తరువాత ' అపీతకుచాంబ ' ఆలయాన్ని దర్శించుకున్నాడు. ' అయ్యంగుల ' కోనేటి వద్దకు వెళ్ళాడు. దగ్గరవున్న భక్ష్యపొట్లాలు కోనేటిలోనికి విసిరి వేసాడు. తన వెనుకటి జీవిత స్మృతులు గుర్తుకోచ్చేవన్నీ దూరంచేసుకునే కార్యక్రమంలో తన ఒత్తైన పొడవాటిజుట్టు కూడా అనవసరం అనుకున్నాడు. అలాఅనుకుంటూ వుండగానే, ఒక అపరిచితుడు ఆతనిని ఒకమంగలి యింటివద్దకు చేర్చి అద్రుశ్యుడయ్యాడు. ఏమి ఈశ్వరలీలా పరంపర. అడుగడుగునా వేంకటరామన్ ని చెయ్యిపట్టుకుని నడిపించిన తండ్రి. శిరోముండనం అనుకున్నంతలో తనప్రమేయం లేకుండానే ముగించుకున్నాడు వేంకటరామన్. ఇక కౌపీన వస్త్రధారణ. ఇది బ్రహ్మచర్య వ్రతధారణకు గుర్తు. తనుకట్టుకున్న వస్త్రాన్నే చింపి, ఒక పేలికను కౌపీనంగా కట్టుకున్నాడు. మంగలికి ఇవ్వగా మిగిలిన ద్రవ్యాన్ని కూడా అక్కడే పారవైచాడు. మళ్ళీ జీవితంలో ద్రవ్యాన్ని చేతులతో తాకలేదు. ఇక మిగిలింది బ్రాహ్మణ సంకేతమైన యజ్ఞోపవీతం. తన పూర్వజీవితములో తండ్రిగారు ఉపనయనం లో వేసినది. జగానికే తండ్రి అయిన అరుణాచలపుత్రుడను కనుక నేను కులాలకు అతీతుడను అనుకుని వెంటనే జంధ్యాన్ని కూడా తీసి పారవేశాడు.
ఇక మిగిలింది స్నానం . అదికూడా అనవసరమని వేంకటరామన్ వూరుకున్నాడు. అయితే తండ్రి నియమలోపం జరుగనివ్వలేదు. బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు. నీటిధారల మధ్య సన్యాస వ్రతధారణ నిరాటంకంగా పరిసమాప్తమైనది. ఆశ్చర్యం. అప్పటిదాకా గ్రామంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందిపడ్డారు. చాలారోజుల తరువాత వెంకటరామన్ వచ్చి అక్కడ వర్షం కురిపించాడు తన సన్యాసధారణ కోసం.
ఆరాత్రి అంతా వేంకటరామన్ ఆలయంలోని వేగాళ్ళమండపం లో చలికి గజగజ వణికిపోతూ కాళ్ళు దగ్గరగా ముడుచుకుని మౌనంగా ధ్యాననిష్టలో కూర్చున్నాడు, కటిక ఉపవాసంతో. మరునాడు ఉదయం ప్రక్కనే వున్న శ్రీగోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయం లో వుంటున్న మౌనస్వామి శిష్యునితో ఆ మండపంవద్దకు వచ్చాడు. అక్కడే పచార్లుచేస్తున్న వేంకటరామన్ ని పరీక్షగాచూచి ఈ కుర్రవానికి ఆహారం తీసుకురమ్మని శిష్యునికి చెప్పాడు. వారు తెచ్చుకున్న భిక్షాన్నం లోని కొంతభాగాన్ని ఉప్పుడు బియ్యపు అన్నం పెద్ద పెద్దమెతుకులతో పైన ఉప్పు, అడుగున పుల్లనీళ్ళు, నంచుకునేందుకు ఊరగాయబద్దతో తీసుకువచ్చాడు. ' అదే ఈశ్వరుడు మనకు పెట్టిన మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్ళు తాగాను ' అని తరువాత రోజుల్లో భక్తులతో ఆ సంఘటన తరచూ చెప్పేవారు, రమణులు.
ఆ తరువాత 3 యేండ్లదాకా వేంకటరామన్ దేవాలయ గర్భగుడికి వెళ్ళలేదు. హృదయ గర్భంలో తండ్రి పదిలంగా వున్నాడు కదా!
అక్కడి సాంప్రదాయం ప్రకారం విరాగులు అయిన వారిని ' పరదేశులు ' అంటారు. మన వేంకటరామన్ కూడా ఆ విధంగా బ్రాహ్మణ పరదేశి అయినాడు. వేంకటరామన్ జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది.
మొదటి రోజుల్లో వేగాళ్ళ మండపం మధ్యలో వున్న అరుగుమీద మౌనంగా ధ్యానంలో వుండేవాడు. అప్పుడప్పుడు లేచి పచార్లు చేసినా మాట్లాడేవాడు కాదు. ఆహారం గురించి యెవరినీ అడిగే ప్రసక్తేలేదు తమకు తాముగా యెవరైనా యేదైనా యిస్తే, సమాధిస్థితిలో లేకపొతే తీసుకునేవాడు. కొత్తప్రదేశం. ఆదరించేవారు లేరు. ఏ విధమైన రక్షణలేదు. అసలు సిసలైన సన్యాస జీవితం.
కొంటె పిల్లలు కొందరు రాళ్ళు, చిల్లపెంకులు వేసి పరదేశి ధ్యానానికి అంతరాయం కలిగించేవారు. వారి బారినుండి తప్పించుకొనడానికి పరదేశి అక్కడున్న పాతాళలింగ గుహను ప్రవేశించాడు. అందులోకి వెళ్ళడానికి పిల్లలు భయపడే వారు. లోపల అంతాచీకటి. అందులోనికి వెళ్లి పరదేశి ధ్యాననిష్టలో వుండేవాడు. అక్కడా కీటకాల బాధ, పిల్లల బాధ మొదలైంది. పరదేశి ధ్యాననిష్టను చూసి, కంచి నుండి వచ్చిన శేషాద్రిస్వామి, ఆయనను గుహ వెలుపల నుండి జాగ్రత్తగా చూసుకునేవాడు.
శేషాద్రిస్వామినీ లెక్కచెయ్యక కొంతమంది తురకబాలురు గుహలోనికి రాళ్ళు వేయుచుండగా, ప్రక్కనుంచి వెళుతున్న వేంకటాచలమొదలియారు వారిని తరిమి, గుహలోనికి వెళ్లి కటికచీకటిలో శివలింగం వెనుక ధ్యానమగ్నుడైన చిన్నస్వామి ( పరదేశి ) ని చూశాడు. అక్కడే దగ్గరలో వేగాళ్ళమండపానికి పశ్చిమంగా వున్న తోటలో పళనిస్వామి అనే ఆయన తన శిష్యులతో వుండేవాడు. వారిని సహాయం పిలిచి అక్కడి నుంచి పరదేశిని బైటకు తీసుకువద్దామని ప్రయత్నించినా దేహస్మృతి కలగలేదు చిన్నస్వామికి. వారు యేమీ చెయ్యలేక ధ్యానభంగం చెయ్యడం యిష్టంలేక ఆయనకు మ్రొక్కి వెళ్లిపోయారు. చిన్నస్వామి ని అప్పటి నుంచి ' బ్రాహ్మణస్వామి ' అని పిలవడం మొదలుపెట్టారు. అలా 'పరదేశి' పేరు నుండి ' స్వామి' అయ్యాడు మన వెంకటరామన్.
రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -8.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
మన వేంకటరామన్ పరదేశి అనే పేరు నుండి బ్రాహ్మణస్వామి గా రూపాంతరం చెందాడని చెప్పుకున్నాం కదా!
బ్రాహ్మణస్వామి మరికొన్ని రోజులలో పాతాళలింగ గుహ వదలి తనకు మొదట భిక్షపెట్టిన గోపుర సుబ్రహ్మణ్యస్వామి గుడిలో మౌనస్వామి సంరక్షణలో సుమారు రెండునెలలు వున్నారు. అప్పుడే రామచంద్రయ్యర్ అనే ఆయనకు స్వామిరానని చెబుతున్నా, బలవంతంగా యింటికి తీసుకువెళ్లి అరిటాకులో సుష్టుగా భోజనం పెట్టే భాగ్యం కలిగింది.
అరుణాచలం వచ్చిన తరువాత నాలుగునెలల వరకు స్వామి స్నానంచెయ్యలేదు. ఒకరోజు పొన్నుస్వామి అనే భక్తుడిభార్య మీనాక్షమ్మ వచ్చి స్వామిని బలవంతంగా లాగి కూర్చోబెట్టి సీకాయతో తలంతారుద్ది స్నానం చేయించింది. తరువాత మళ్ళీ సంవత్సరందాకా స్వామికి స్నానమేలేదు.
అదే విధంగా, నీలకంఠమ్ అనేభక్తుడు స్వామికి క్షురకర్మ చేయించాలని ప్రయత్నించగా అక్కడినుండి దూరంగా స్వామి వెళ్ళిపోయారు. స్వామికి యిష్టంలేదని గ్రహించి అతను ఆప్రయత్నం విరమించు కున్నాడు. అంతే. మళ్ళీ ఒకటిన్నర సంవత్సరందాకా స్వామికి క్షౌరమేలేదు.
కౌపీనం చిరిగి పోయినా 1898 చివరి వరకు అదే చిరిగిన కౌపీనంతో తిరిగారు కానీ, మార్చుకోలేదు. కౌపీనం ధరించినవాడితో ఆయన బంధం వుంటేగదా ! వచ్చే భక్తులకు చూడయిబ్బందిగా వుంటే, స్వామి వాహనమండపం దగ్గరా, వాహనాల గోడవెనుక కొంత కాలం ధ్యానంలో కాలం గడిపారు. అసలు సిసలైన సన్యాసి జీవితం.
మరి కొన్నాళ్ళకు స్వామి, శివగంగ తీర్ధం దగ్గర మారేడుచెట్టు క్రింద, ఇప్పచెట్టు దగ్గర, ఇంకొన్నాళ్ళు మంగై పిళ్ళయారు గుడిలోను కాలం గడిపారు. అప్పుడే రత్తమ్మ అనే దేవదాసి విపరీతమైన భక్తితో స్వామి భోజనం యేర్పాట్లు దగ్గరుండి చూసుకునే భాగ్యం కలిగింది. తిరుమణి గ్రామంలో వుండే ఉద్దండి నాయనారు అనే శైవభక్తుడు ఎన్నో గ్రంధాలు, వేదాలు చదివినా ఆధ్యాత్మిక శాంతి పొందలేక పోయాడు. అయితే, ఇప్పచెట్టు క్రింద తదేకనిష్ఠతో వున్న స్వామిని చూడగానే, నాయనారు మనసు ఝల్లుమంది. ఆయనే తన గురువని విశ్వాసం కుదిరింది. ఎముకలు కోరికే శీతాకాలంలో కూడా స్వామి సమీపంలో వుండి సేవించసాగాడు. పిల్లల ఆగడాలు తగ్గినాయి. అయినా ఒకరోజు నాయనారు లేని సమయంలో ఒక పోకిరి పిల్లవాడు స్వామి ధ్యానంలో వుండగా, వెనుక మూత్రవిసర్జన చేసి పారిపోయాడు. బాహ్యస్మృతి వచ్చిన తరువాత విషయం తెలిసినా స్వామి యేమాత్రం బాధపడలేదు. ఆ శరీరంతో ఆయన సంబంధం తొలగిపోతున్నదన్నందుకు యివన్నీ నిదర్శనాలే కదా! స్వామి తదేకనిష్ఠతో వుండి కండ్లు తెరచేవారు కాదు. నాయనారు మాత్రం జ్ఞానవాశిష్టం, కైవల్య నవనీతాలు పఠిస్తో యెదురుగుండా కూర్చునేవారు. లౌకికులకు అర్ధంగాని గురుశిష్య సంబంధము.
అలా అయిదారునెలలు గడిచాక, స్వామి గురుమూర్తమునకు మకాము మార్చారు. గురుమూర్తంలో సమాధిపూజలను అన్నామలై తంబిరాను యెంతో నిష్టతో చేస్తూ వుండేవాడు. ఒకనాడు స్వామిని ఇప్పచెట్టు క్రింద చూసి, ఆకర్షితుడై నాయనారు సలహాపై స్వయంగా స్వామినే అడిగాడు తంబిరాను గురుమూర్తమునకు రమ్మనమని. అక్కడ స్వామి ధ్యానానికి అంతరాయం వుండదు, అరుణాచలం కి కూడా దగ్గరే ఉంటుందని నచ్చజెప్పి స్వామిని గురుమూర్తం రావడానికి అంగీకరింపజేశాడు. 1897 ఫిబ్రవరి లో స్వామి గురుమూర్తమునకు వచ్చారు. ఆనాటి నుండి బ్రాహ్మణస్వామి ' గురుమూర్తం స్వామి ' అయినారు.
స్వామి ధ్యానము యెట్టి విఘ్నాలులేకుండా సాగిపోతుండేది. అయితే, శరీరానికి చెయ్యవలసిన వుపచారాలు లోపించడంవలన శరీరం అంతా దుమ్ముకొట్టుకుపోయింది. వెంట్రుకలు జడలు కట్టాయి. గోళ్ళు వంకరలుగా పెరిగి చేతులను కూడా నిరుపయోగం చేశాయి. చీమలు విపరీతంగా బాధ పెట్టేవి. స్వామి శరీరపోషణ లేకపోవడం వలన చూడడానికి భీభత్సంగా కనుపించేవారు. ఒకనాడు మీనాక్షి అనే భక్తురాలు బలవంతాన స్వామికి నూనెరాసి తలంటింది. ఆ విధంగా స్వామి రెండోసారి స్నానంచేశారు.
కాలం గడుస్తున్న కొద్దీ జనులకి స్వామిపట్ల గౌరవం పెరిగింది. స్వామికి భిక్షపెట్టే భాగ్యం తమకు కావాలంటే తమకని తగవులాడుకోవడం ప్రారంభించారు. పూర్వం భిక్ష దొరకడం కష్టమైతే యిప్పుడు భిక్ష పెట్టేవాళ్ళు ఎక్కువై ఇబ్బంది కలుగసాగింది . తంబిరానుకు కూడా స్వామి పట్ల భక్తివిశ్వాసాలు బాగాకుదిరాయి. ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించాలని ఒకనాడు ప్రయత్నంచేశాడు.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -9.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
తంబిరాను ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించాలని ఒకనాడు ప్రయత్నంచేశాడు కదా!
స్వామి దానిని సహింపలేక మొదటిరోజు యెట్లాగో వోర్చుకుని, రెండవరోజు అతను వచ్చేముందే గోడమీద బొగ్గుతో ఈ శరీరానికి భోజనమే అవసరం అని అర్ధం వచ్చేటట్లు వ్రాసి, తంబిరానుకు చూపించారు. ఆయినా అతడు మానకపోయేసరికి ఆరాధన సమయానికి బయటకు వెళ్ళేవారు స్వామి. తరువాత తంబిరాను ధూప దీప నైవేద్యాలు స్వామికి సమర్పించుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
నెమ్మది నెమ్మదిగా స్వామి పూర్వాశ్రమనామము బయటకు వచ్చింది. అది ఎలాగంటే : వెంకటరామయ్యర్ అనేభక్తుడు వుదయం రోజూ కొన్నిగంటలు స్వామి దగ్గర గడిపేవాడు. ఒకరోజు స్వామి పూర్వనామం చెబితే కాని కదలనని భీష్మించుకుని కూర్చున్నాడు. కాగితము, పెన్సిలూ స్వామి చేతికి యిచ్చి అలాగే కూర్చున్నాడు. " వేంకటరామన్. తిరుచ్చుళి " అని ఇంగ్లీషులో వ్రాసి ఇచ్చారు స్వామి. పక్కనే తంబిరాను వున్నాడు, అప్పుడు.
గురుమూర్తంకి స్వామివచ్చి రెండునెలలు అవుతుండగా, స్వామిని నాయనారుకి వప్పచెప్పి, తంబిరాను వారంలో వస్తానని ఎక్కడకో వెళ్లి తిరిగిరాలేదు. తరువాత నాయనారు కూడా కొన్ని వారాలకు అరుణా చలం వదలి వెళ్లి పోయాడు. స్వామి వంటరివాడయ్యాడు. స్వామి వంటరివాడు యెలా అవుతాడు, తండ్రి సన్నిధిలో. పళనిస్వామి అని ఒక మళయాళ దేశస్తుడు స్వామిని దర్శించి ఆయనే తనకు కైవల్యం కలిపించేవాడు అని నమ్మి స్వామికి ఆనాటినుండి స్వామి ఆమరణాంతము స్వామియే తల్లి తండ్రి గురువు అని నమ్మి నీడవలె వెన్నంటివున్నాడు. వయసురీత్యా అతడు స్వామికంటే 30 యేండ్లు పెద్దవాడు. ఇవి ఏనాటి బంధాలో ! ఎవరు ఏర్పరచిన బాంధవ్యాలో !!
తరచి చూస్తే, సామాన్యుల జీవితాలలో కూడా, చాలా దగ్గరవారు అనుకున్నవారు, తమతోవుండే ఆస్కారం వుండదు. అప్పటివరకు ముఖపరిచయము కూడా లేనివారు, ఆప్తులై జీవితంలో వెన్నంటివుంటారు. సామాన్యుల విషయం లోనే యిలాంటివి సంభవం అయినప్పుడు స్వామికి అలాంటి శిష్యుడు దొరకడంలో ఆశ్చర్యం యేమి వుంటుంది !.
పగలూ, రాత్రీ స్వామి ధ్యానం లో వుండడం వలన దేహం బలహీనమైనది. ఒకనాడు స్పృహతప్పి ప్రక్కనే కాచుకుని వున్న పళనిస్వామి చేతులలో పడిపోయారు. తరువాత తరువాత భక్తులు బ్రతిమిలాడి ఆయనకి క్షౌరం చేయించి శరీరం శుభ్రంచేసేవారు.
గురుమూర్తం దగ్గరలోని మామిడితోపు యజమాని వెంకటనాయకర్ తనతోటలో వుండమని అర్ధించాడు. అక్కడికి వచ్చిన తరువాత స్వామి మౌనంగా వున్నప్పటికీ కళ్ళుతెరచి చూచేవారు.
అక్కడ వేంకటరామన్ కుటుంబంలో కాలచక్రం యెన్నో మార్పులు తీసుకువచ్చింది. అన్న నాగస్వామి చిరుద్యోగిగా జీవితం వెళ్లదీస్తున్నాడు. పెద్ద పినతండ్రి సుబ్బయ్యరు 1898 మే నెలలో కాలం చేశాడు. చిన్న పినతండ్రి నెల్లిప్పయ్యరు యింట్లో ఒకరోజు అందరూ వున్నప్పుడు, వాళ్ళ ఊరివాడు ఒకడు యెంతో సంతోషంగా వచ్చి " వెంకటరామన్ తిరువన్నామలైలో పెద్దసాధువుగా ఉన్నాడట " అని వారికి చెప్పాడు. తనకు తంబిరను అనే ఆయన వల్ల తెలిసిందనీ బాలసన్యాసిగా వున్నాడని చెప్పాడని చెప్పాడు. అయితే ఆ వార్త నమ్మబుద్ధి కాలేదు కుటుంబ సభ్యులకు.
ఒకసారి వాకబు చేద్దామని నెల్లియప్పరు వెంటనే, ఇంకొక కుటుంబసభ్యునితో కలిసి తిరువన్నామలై వెళ్ళాడు. స్వామి అనుమతితో వారు మామిడితోపులో వున్న స్వామిని దర్శించారు. వేంకటరామన్ పాదం ముందుభాగం లోని పెద్దపుట్టుమచ్చ వలన వారు స్వామిని వేంకటరామన్ గా పోల్చుకోగలిగారు. స్వామి వున్న పరిస్థితికి బాధపడాలో, ఆధ్యాత్మికంగా గొప్పస్థితిలొ వున్నందుకు సంతోషించాలో వారికి అవగతం కాలేదు.
ఇంటి పరిస్థితులు చెప్పి నెల్లియప్పరు స్వామిని తిరిగి రమ్మని బ్రతిమిలాడాడు. స్వామి మౌనమే సమాధానంగా విముఖతను తెలియచేశారు. కొంత ఆధ్యాత్మికచింతన వున్నవాడు అగుటవలన స్వామి స్థితి అర్ధంచేసుకుని పినతండ్రి యిక బలవంతపెట్టలేదు. అయితే ప్రక్కనవచ్చిన బంధువు స్వామిని బలవంతానలేపి తీసుకువెళ్దామని దగ్గరకు వెళ్ళగా, ఒళ్ళంతా మంటలుపుట్టాయి, ఆబంధువుకు. ఇక లాభంలేదని యిద్దరూ యింటిముఖం పట్టారు. తల్లి అళగమ్మకు యీ విషయాలన్నీ చెప్పగా, ఆమె ఒకప్రక్క సంతోషము, మరియొక ప్రక్క దు:ఖము ముప్పిరిగొనగా, నాగస్వామిని అక్కడకు తీసుకు వెళ్ళమని వేడుకున్నది. అతని కార్యాలయ సెలవులప్పుడు వెళదామని తల్లికి నచ్చచెప్పాడు.
అక్కడ మామిడితోపులో 6 నెలలు వున్న స్వామి, తనవలన తోపు పాడగునని తలచి అరుణగిరినాధ దేవాలయానికి స్వామి తన మకాము మార్చారు. అప్పటిదాకా పళనిస్వామి తనకు భిక్ష వూరిలో వారి నుండి తెచ్చి పెట్టేవాడు. తోపునుండి బయటకు వచ్చిన తరువాత, స్వామి స్వయంగా వెళ్లి భిక్ష తెచ్చుకునేవాడు. తనకు పరిచారకుడు అవసరం లేదని పళనిస్వామిని వెళ్లి పొమ్మన్నారు, స్వామి. ఆవునువదలి దూడ వెళ్లలేని విధంగా, యెక్కడికీ వెళ్ళలేక తిరిగి స్వామినే ఆశ్రయించాడు పళనిస్వామి.
రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -10.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
ఒక్కొక్క సారి స్వామి రాత్రులు భిక్షకు వెళ్ళేవారు. గృహస్తులు లాంతర్లు పట్టుకుని, స్వామికి దారి చూపిస్తూ తీసుకువెళ్ళేవారు. ఆ అగ్రహారం లోని అన్ని యిళ్ళలో స్వామి భిక్ష స్వీకరించేవారు, వారిని తృప్తి పరచడానికి. అది కూడా విసుగుగా అనిపించి ఒక నెలరోజులలోనే స్వామి అరుణాచల కోవెలలోను, పడమట గోపురంలోను వుండసాగారు. అక్కడా జనుల తాకిడి తట్టుకోలేక అరుణాచలానికి ఈశాన్యంగా 1898 సెప్టెంబరులో ' పవళకున్రు ' కు మకాం మార్చారు. అక్కడ దేవాలయంలోనూ, గుహలోను కాలం గడిపేవారు. కొండదిగి వూళ్ళో భిక్షాటనకు వెళ్ళేవారు. వీధులలోనే తింటూ వెళ్ళేవారు. దీన్ని ' కరతల భిక్ష ' గా స్వామి తరువాత రోజుల్లో వర్ణించి యెంతో హాస్యంగా చెప్పేవారు. " దోసిలిపట్టి భిక్ష తీసుకుని తింటూ వీధుల మధ్య పోతుండేవాడిని. తినడం అయితే చెయ్యి నాకుతూ పోతుండేవాడిని . దేనిమీదా లక్ష్యం వుండేదికాదు. ఆ కరతల భిక్ష యెంతో వేడుకగా వుండేది. పెద్ద పెద్ద ఘనాపాఠీలు, ఉద్యోగస్తులు ప్రక్కన నడుస్తుండేవారు. ఎవరుంటే నాకేమి? నేను దరిద్రుడని భిక్ష యాచిస్తే దీనంగా వుండాలి. అహం నాశనం అయినవాడికి చక్రవర్తి యెదురుగా వచ్చినా లక్ష్యం వుండదు. నేను భిక్షకు అలా వెళ్లి చప్పట్లు కొట్టగానే, కొందరు భయభక్తులతో భిక్ష పెట్టేవారు. తెలియని వారు ' బాగుగా బలిసి వున్నారు ! కొలువుకు పోరాదా ! ' అనేవాళ్ళు. నవ్వువచ్చేది. కానీ, మౌనస్వామిని కదా ! వాళ్లన్నకొద్దీ సరదాగా వుండేది. అదొక వేడుకగా నే సుమా ! " అని చెప్పేవారు.
తరువాత మారిన పరిస్థుల గురించి స్వామి యిలాగ అనేవారు " భిక్షంటే వడ పాయసం తప్పదు. కొన్ని చోట్ల పాదపూజలకు పైసలు తెమ్మంటారు. మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితేగానీ ఔపొశనమ్ వేసుకోము అంటారు. ఎంతో గొప్పదైన ఆ కరతల భిక్ష యొక్క తాత్పర్యం యిలా పరిణమించింది. "
ఇలావుండగా, 1898 డిశంబరు క్రిస్టమస్ సెలవులకు పెద్దకుమారుడు నాగస్వామితో కలిసి అళగమ్మ అరుణాచలం వచ్చింది. వారు వెళ్లేసరికి స్వామి ఒక రాతిబండపై పడుకుని వున్నారు. మట్టికొట్టుకుని పోయిన శరీరంతో , మాసిన కౌపీనంతో వున్నా ఆమె గుర్తించింది. మాతృ హృదయం కదా! కొడుకుని ఆ స్థితిలో చూచి గుండె పగిలేలా యేడ్చింది. ఇంటికిరమ్మని బ్రతిమిలాడింది. కానీ స్వామి వులకలేదు. పలుకలేదు. చలించలేదు. మర్నాడు ఆమె వచ్చేసరికి స్వామి జనంమధ్యలో కూర్చుని వున్నారు. అక్కడవున్న జనంతో తన దయనీయ చరిత్ర చెప్పుకుని యేడ్చింది. ఆమె దు:ఖాన్ని చూడలేక, అక్కడివారు ' స్వామీ! ఆమె దు:ఖం తీర్చలేరా ! మీరు మౌనములో వున్నారు కదా, యేదో ఒకటి ఈ కాగితం మీద వ్రాసి ఆమెకు వూరట కలిగించండి ' అని అడిగారు. స్వామి ఆకాగితం పై ' వారివారి ప్రారబ్ధానుసారం కర్త జీవులను నడిపించును. జరుగనిది ఎవరెంత ప్రయత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత అడ్డుపెట్టినను జరుగునే జరుగును. ఇదిసత్యము. కనుక, మౌనముగా నుండడమే ఉత్తమము. ' అని వ్రాశారు.
ఇ దే స్వా మి ప్ర ధ మో ప దే శ ము.
తల్లి ప్రార్ధనలు ఫలించలేదు. నాగస్వామి సెలవలు ముగుస్తున్నాయి. ఎటూ పాలుపోక, ఆమె దిక్కుతోచక, గాయపడిన హృదయంతో అరుణాచలెశుని మ్రుందు కన్నీళ్ళతో నిలబడి ' ఇక వెంకటరామన్ నా బిడ్డ కాదు. నీ బిడ్డ. నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. ' అంటూ వదలలేక వదలలేక అరుణాచలం వదలి వెళ్లి పోయింది.
అప్పటికే స్వామి తననుతాను అరుణా చలేశ్వరునికి అర్పణ చేసుకున్నాడు. ఇప్పుడు నవమాసాలూ మోసిన కన్నతల్లికూడా అరుణాచలేశునికే తనను అర్పించింది. ఇక వెంకటరామన్ బాధ్యత పూర్తిగా అరునాచాలేశ్వరునిదే అయ్యింది. రమణుడు అవతారమూర్తి అనడానికి యింతకంటే హృద్యమైన సన్నివేశం యేమి వుంటుంది. తల్లి అనుమతి లేకుండా సన్యసించ కూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ తల్లే పరిస్థితుల ప్రభావం వలన అనుమతించినట్లు అయ్యింది.
1889 ఫిబ్రవరిలో స్వామి పవలకున్రును వీడి అరుణాచలం కొండమీద వున్న విరూపాక్షగుహకు మకాం మార్చారు. ఆగుహ ఓంకారఆకృతిలో వుంటుంది. వాయువు ఆగుహలోనికి ప్రవేశించినపుడు దానివలన ఓం కారం వినిపిస్తుంది. ప్రకనే నీటిబుగ్గ. అందులో విరూపాక్షదేవర సమాధి వున్నది. మన స్వామి యీ గుహలోనే గిరినివాసం ప్రారంభించారు.
రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -11.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
విరూపాక్షగుహలో వేసవికాలంలో వేడిగా వుండి నీరుకూడా దొరకకపోవడంతో, అక్కడికి వచ్చే భక్తులలో శ్రీ రంగాచార్య, రామానుజాచార్య అనేసోదరులు పక్కనేవున్న మామిడి గుహలో స్వామి వుండడానికి వీలుగా వసతులు కల్పించారు. స్వామికి వేసవివిడిది ఈగుహలో ఆవిధంగా ఏర్పడింది.
విరూపాక్షగుహలో భక్తులసంఖ్య రోజురోజుకీ పెరగసాగింది. పండితులు, జిజ్ఞాసువులూ కూడా రావడం ప్రారంభించారు. స్వామి భక్తులప్రశ్నలకు కాగితాల మీద వ్రాసో, సంజ్ఞల ద్వారానో జవాబులి చ్చేవారు. ఆహారవిషయంలో కూడా స్వామికి లోపంలేకుండా జరిగిపోతున్నది. అలాంటిసమయం లో 1905 లో తిరువణ్నామలైలో ప్లేగువ్యాధి వ్యాపించింది. ఆసమయంలో స్వామి కొండమీద పచ్చైయమ్మన్ గుడిలో వుండి తిరిగి విరూపాక్షగుహకు వచ్చారు.
మెల్లమెల్లగా స్వామి కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. దర్శించడానికి వచ్చే జనులసంఖ్య కూడా అధికం కాజొచ్చింది. అదేసమయంలో ' కావ్యకంఠ ' బిరుదుతో ప్రఖ్యాతి పొందిన శ్రీ గణపతిమునులు, మహాకవి, మంత్రసిద్ధులు అయి కూడా యెన్ని పవిత్రప్రదేశాలు తిరిగినా మానసికశాంతి కలుగక తిరువన్నామలై వచ్చారు 1907 నవంబరు 18 న. ఇంతకుముందు గణపతి మునులు రెండుసార్లు స్వామిని దర్శించారు. కానీ, ఈసారి దర్శించినపుడు ఒక అద్భుతం జరిగి ఆయన జీవితాన్నే మార్చేసింది. విరూపాక్షగుహలో వున్న స్వామిని దర్శించి మనసుకు ప్రశాంతత ఏర్పడగా, సాష్టాంగనమస్కారం చేసి, వారి పాదాలను వదలక, కంపిస్తున్న స్వరంతో " చదవవలసిందంతా చదివాను. వేదాంతశాస్త్రాన్ని తెలుసుకున్నాను. మంత్రజపం చేశాను. కానీ యింతవరకు నాకు తపస్సంటే యేమిటో అవగాహన కాలేదు. మీ పాదాలనే శరణని నమ్ముకున్నాను. నన్ను కరుణించి నాకు తపస్సు స్వభావం తెలపండి. " అని వేడుకున్నారు.
ఆశ్చర్యం! పరమాద్భుతం. 1896 సెప్టెంబరులో తిరువన్నామలై వచ్చినప్పటి నుంచి నోరువిప్పి మాట్లాడని బ్రాహ్మణస్వామి పదిహేనునిముషాలపాటు స్థిరంగా గణపతిమునిని చూశారు. నెమ్మదిగా పెదవులను కదుపసాగారు. కంఠాన్ని సవరించుకుంటూ, తమిళంలో అతి తక్కువమాటలతో మధ్య మధ్యలో ఆగుతూ " ఈ నేను అన్నభావం యెక్కడ పుడుతుందో పరిశీలించినట్లయితే మనస్సు అందులో లీనమగును. అదేతపస్సు . మంత్రజపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడనుండి పుట్టునో గమనించిన మనస్సు అందులో లీనమగును." అని అన్నారు. ఆ దివ్యమైన ఉపదేశంతో గణపతిముని ఆర్తి చల్లారింది. ఆహా ! ఇద్దరుమహాత్ముల అపురూప కలయిక. ఎన్ని మహత్తర ఘటనలకు దారి చూపిస్తుందో.
అలా స్వామిచెంత కొన్నిగంటలు గడిపిన తరువాత, స్వామి పేరు పలనిస్వామి ద్వారా తెలుసుకుని, రామనామ బీజాక్షరాల మూలంతో ' శ్రీ రమణ ' నామంగా మార్చి వెంటనే ' శ్రీ రమణ పంచకం ' రచించారు. మనం గుర్తుతెచ్చుకుంటే ఈ రమణనామం చిన్నప్పుడు తెలుగు మాస్టారు లక్ష్మయ్యరు ముద్దుగా పిలిచిన పేరేకదా !
ఇక ఆలశ్యం చెయ్యకుండా గణపతి మునీంద్రులు స్వామిని ' భగవాన్ శ్రీరమణ మహర్షి ' అని పిలువ వలెనని ఆదేశించారు తనచుట్టూ వున్న భక్తకోటికి. ఆపేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగి, ' మహర్షి '
' భగవాన్ ' అనే నామాలు రమణులకు అతికిపోయాయి. అసంఖ్యాకులైన తమ శిష్యబృందంతో గణపతి ముని భగవాన్ శ్రీరమణ పాదాలకు అంకితమయ్యారు. ఆవిధంగా రమణభక్తులలో కావ్యకంఠ గణపతి ముని అగ్రస్థానంలో నిలిచారు.
రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -12.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
రమణుల పరిణామక్రమం ఒక్కసారి చూస్తే, 16 సం. ప్రాయంలోనే ఈశ్వరానుగ్రహం వలన ఆత్మానుభూతిని పొందారు.
అది స్థిరపడి సహజస్థితిగా రూపొందడానికి మౌననిష్ఠలో ఏకాంతవాసంలో 11 సం. 1896 సెప్టెంబరు నుండి 1907 నవంబరు వరకు వున్నారు.
కావ్యకంఠ గణపతిముని వీరితో కలిసిన తరువాత అప్పటినుండి 3నెలలు పచ్చయ్యమ్మన్ కోవెలలో గడిపారు శిష్యబృందంతో. ఆరోజుల్లో ఒకనాడు భగవాన్ శ్రీరమణమహర్షి నుండి గొప్ప తేజస్సు వెలువడి వృత్తాకారంలో తిరుగుతూ ధవళకాంతులు విరజిమ్ముతూ ఆరునక్షత్రాలుగా విడిపోయింది. అవి తిరిగి వచ్చి రమణుని ఫాలభాగాన్ని తాకి వెనక్కివెళ్లి మళ్ళీవచ్చి ఆరుసార్లు ఫాలభాగాన్ని తాకాయి. ఆ తరువాత ఆతేజస్సు కొన్నిక్షణాలలో భగవాన్లో తిరిగి కలిసిపోయింది.
ఈదృశ్యం అక్కడవున్న భక్తులందరూ, గణపతిముని సమక్షంలో చూశారు. గణపతి ముని భక్తులని ఉద్దేశ్యించి " నేను దివ్యదృష్టి తో అబద్ధమెరుగని వాక్కుతో అధికారపూర్వకంగా చెబుతున్నాను. ఈ రమణుడు సాక్షాత్తూ పార్వతీదేవి ముద్దులకుమారుడైన కుమారస్వామియే. సందేహం లేదు. " అని ప్రకటించి భగవాన్కి సాష్టాంగప్రణామం చేసి ఆశువుగా ఎనిమిదిశ్లోకాలు చెప్పారు.
ఇక్కడ యీవిధంగా జ్ఞానసముపార్జన భక్తులకు జరుగుతుండగా, అక్కడ అళగమ్మ కుటుంబసమస్యలతో నానా యిబ్బందులు ఎదుర్కుంటూ వున్నది. పెద్దకుమారుడు 1900 సం. లో మరణించాడు. మూడవకుమారుడు నాగసుందరం 14వ యేటనే దేవస్థానంలో ఉద్యోగానికి చేరాడు, కుటుంబ పోషణకోసం. 1902 లో అన్నను చూడవచ్చి భోరున కౌగలించుకుని ఏడ్చాడు నాగసుందరం. రమణులు ఉదాసీనంగా వుండిపోయారు. అతడుకూడా నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూచి అళగమ్మ కి జీవితం పై విరక్తికలిగి కాశీకి 1913 లో వెళ్లి తిరుగుప్రయాణంలో భగవాన్ చెంత కొంతకాలం వుండివెళ్ళింది.
మరియొకసారి 1914 లో స్వామిని చూడడానికి వచ్చి టైఫాయిడ్ బారినపడింది. ఏ మందులూ పని చెయ్యలేదు. డాక్టర్లు ఆశలేదని చెప్పారు. ఆసమయంలో తల్లికి సేవచేస్తో, తల్లిని రక్షింపమని అరుణా చలేశ్వరుని స్థుతిస్తో నాలుగుశ్లోకాలు వ్రాశారు రమణులు.
అళగమ్మకు వ్యాధితగ్గి ఆరోగ్యం చేకూరింది. తమ్ముడు వచ్చినప్పుడు ఉదాసీనంగా వున్న రమణులు తల్లి విషయంలో అరుణాచలేశ్వరునే ఆమె ఆరోగ్యం కోసం వేడుకున్నారంటే, మాతృస్థానానికి రమణులు యిచ్చిన విలువ అర్ధమవుతుంది.
ఆశ్రమవాసులకు బరువుగా వుండడానికి యిష్టపడక, అళగమ్మ తిరిగి మూడవకుమారుని యింటికి వెళ్ళిపోయింది. 1915 లో కోడలు పసిబిడ్డను వదలి మరణించింది. చిన్నకూతురు దగ్గర ఆ శిశువును వదలి మళ్ళీ విరూపాక్షగుహకి చేరుకుంది అళగమ్మ. అక్కడ చూడబోతే గుహ చిన్నది. ఆమెకు గుహలో రమణునితో వుండాలని కోరిక. భక్తురాలు ఎచ్చమ్మాల్ యింట్లో బసయిచ్చారు. తల్లి అక్కడ శాశ్వతంగా వుంటే రమణులు ఇష్టపడరని, భక్తుల భయం. తను అక్కడ వుంటే స్వామి ఎటో వెళ్లి పోతారనే భయంతో అళగమ్మ కూడా నిరాశతో మళ్ళీ యింటికి పయనమయి వెళ్ళిపోయింది.
ఇలావుండగా, కాలం మళ్ళీ మార్పులు తీసుకుని వచ్చింది. 1917 ఏప్రిల్ లో ఆమె కూడా సంసార బంధాన్ని త్యజించి తిరిగివచ్చి మహర్షిగుహలో ఉండిపోయింది. ఈసారి ఆశ్చర్యం యెవరూ ఆమెకు అడ్డు చెప్పలేదు, స్వామితోసహా. అయితే గుహ చిన్నదిగా వుండడం వలన కొండమీద కొత్తగా కట్టిన స్కందాశ్రమానికి అందరూ తరలివెళ్ళారు.
స్కందాశ్రమం అతి మనోహరంగా వుండేటట్లు శిష్యులు తయారుచేశారు. నారికేళ వృక్షాలతో, మామిడి వృక్షాలతో ఆశ్రమం శోభాయమానంగా తయారుఅయింది. వంటగది వేరుగా, వుడటానికి రెండుగదులు, ముందు వసారా వున్నాయి. ఆశ్రమ నిర్మాణంలో ముఖ్యభక్తుడు కందస్వామి పేరు కలిసి వచ్చేటట్లు స్వామి స్కందుని అవతారమని విశ్వాసం వచ్చినందున, ఆ ఆశ్రమానికి స్కందాశ్రమం అని పేరు పెట్టారు.
మరికొన్నిరొజులకి చివరికుమారుడు నాగసుందరం తన కళ్ళెదుట వుండాలని అళగమ్మ అతనిని కూడా పిలిపించుకుంది. అతనుకూడా వూరిలో వున్న సత్రంలో భోజనంచేసి ఒకభక్తునిలా మాత్రమే స్వామిని దర్శించుకుని వెళ్ళేవాడు. క్రమంగా మహర్షిబోధలు అవగతం చేసుకుని 1918 లో నిరంజనానంద నామాన్ని స్వీకరించి సన్యసించి కాషాయ వస్త్రాలు ధరించాడు, నాగ సుందరం. రమణుని ఆశ్రమంలో ఒక సన్యాసివలే వుండసాగాడు.
యెంత విచిత్రం. శ్రీరమణుని ముత్తాతకాలంలో ఒక సన్యాసి యిచ్చిన శాపం, మూడవ తరంలో ఒక్క శ్రీరమణులతో ఆగక, వారి తల్లిని, తమ్ముని కూడా సన్యసింపచేసింది. ఈ ముగ్గురూ ఒకే ఆశ్రమంలో బంధుత్వం లేకుండా వుండడం ఈనాటి ఆశ్రమ నిర్వహణా సాంప్రదాయం చూసేవారికి వూహకు కూడా అందని ఈశ్వరానుగ్రహం. ఎన్నికుటుంబాలలో యిది సాధ్యం అవుతుంది.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -13.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
అళగమ్మ వృద్ధాప్యం వలన రమణులను ఒక్కక్షణమైనా వదలి వుండేదికాదు. ఈ కొడకుచేతుల్లోనే పోవాలని ఆమెకోరిక. కూతురు రమ్మని పిలిచినా వెళ్ళలేదు.
విరూపాక్షగుహలో నీటి యిబ్బందివుండగా, భగవాన్ భక్తులతో కలిసి స్కంధాశ్రమ జలధార వద్దకువెళ్లి స్నానంచేసి, తల్లికి రెండు పెద్ద కమండలాలలో నీరుతెచ్చి, ఆమె మీద క్రుమ్మరించేవారు, స్నానం చేయించినట్లుగా. అళగమ్మ ఒకరోజున భగవాన్ కి ఇష్టమని జంట అప్పడాలకి వస్తువులు తెప్పించి అప్పడాలు వత్తిపెట్టమని భగవాన్ని అడిగింది. ఆమెకు జిహ్వచాపల్యం తొలగించాలని ' దొరికింది తిని పడి వుండక యివన్నీ యెందుకు? నేను చెయ్యను. నీవు చేసినా నేనుతినను. అన్నీ నువ్వేచేసుకో. నువ్వే తిను ' అన్నారు. అయినా ఆమె వదలకపొతే, ' నీఅప్పడాలు నీవు వత్తుకో, నా అప్పడాలు నేను వత్తుకుంటాను ' అని ఆమె ప్రక్కనే కూర్చుని ' అప్పడపు పాట ' వ్రాశారు. అరవంలో భగవాన్ వ్రాసిన ఈ పాటను శ్రీ ప్రణవానందులు తెలుగుసేత చేశారు. పంచకోశక్షేత్రం గురించి స్వామి చెప్పిన విషయాలు ఆపాటలో తరువాత యెంతో ప్రాచుర్యం పొందాయి.
భగవాన్ తల్లి తర్వాత స్వంతగా వంటచేస్తూ తనకుమారునికి రకరకాల రుచులతో కూరలు తయారు చెయ్య ప్రయత్నించేది. మడి ఆచారం ఆమెకు యెక్కువ అవడం వలన, ఆమెను భగవాన్ పరిహసించేవారు. ఎప్పుడైనా ఈ మడీ ఆచారం శృతి మించుతున్నప్పడు అందరితో కలిసివుండడం కుదరకపొతే యింటికి వెళ్ళడం ఉత్తమం అని హెచ్చరించేవారు.
ఆమె ఒకయోగినిలాగా బ్రతకాలి అనివచ్చినా ఆమెకు రమణులు తన కుమారుడనే భావం గాధంగా వుండేది. ' నాకు అందరూ తల్లులే, నీ ఆధిక్యమేమిటి? ' అని మందలించేవారు. తల్లిపట్ల భగవాన్ తీరు వేరుగా వుండేది. ఆమెను పెత్తనం చేసేదానిగా కాకుండా, ఒక సాధకురాలిగా, ఒక భక్తురాలిగా మాత్రమే చూసేవారు. భక్తులయెడ చూపే చనువుకూడా ఆమె పట్ల చూపేవారుకాదు. ఆతీరుకు భక్తులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఇది కేవలం ఆమెలోని అహంకార మమకారాలు తొలగించడం కోసమే అని ఆమెకు మెల్లగా అవగాహన కాజొచ్చింది. ఆమెకూడా స్వామిభక్తులలో ఒకరుగా మారిపోయారు. ఇప్పుడు స్వామి ఆమెకు జ్యోతిరూపంగాను, ఒక్కొక్కసారి శివునివలె కనిపించేవారు.
1919 లో మళ్ళీ ఒకసారి తిరువన్నామలై లో ప్లేగు ప్రబలింది. శిష్యులు స్కందాశ్రమం వదలి వెళ్ళిపోయారు. కుంజుస్వామి అనే భక్తుడు మాత్రం వీరితో వుండి సేవచేశాడు. తరువాత పరిస్థితి మామూలుగా అయిన తరువాత అందరూ తిరిగివచ్చారు. అప్పటినించి కుంజుస్వామి రమణుల నిర్యాణం వరకు వారితోనే వున్నాడు.
మళ్ళీ అళగమ్మ ఆరోగ్యం పాడైంది. మరణం తప్పదని భావించి బంధువులకు వర్తమానం పంపారు. ఆమె స్పృహ లేకుండా పడుకునేది. స్పృహ వచ్చినప్పుడు రమణులు ఆమెకు ఆత్మబోధ చేశేవారు. చివరి క్షణాలలో వూర్ధ్వశ్వాస, గురక మొదలై 19.05.1922 నాడు స్వామి ఆమె హృదయంపై కుడిచేతిని, శిరస్సుపై యెడమచేతిని వుంచి రాత్రి 8 గం. లకుఆమె పైనుండి చేతులుతీసివేసి అమ్మకు మోక్షప్రాప్తి అయిందని ప్రకటించారు.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -14.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
స్కందాశ్రమంలో తల్లి నిర్యాణమైన రోజు రాత్రంతా భజనలు చేశారు భక్తులు. ఆమె పార్థివదేహాన్ని ఒక అశ్వర్ధవృక్షం క్రింద ఖననం చేసి ఇటుకలతో సమాధిని నిర్మించారు. అనుకోకుండా కాశీనుండి ఒక శివలింగం ఆరోజే స్కందాశ్రమం చేరింది. దానిని సమాధిపై స్థాపనచేశారు. ఆదేవునికి ' మాతృభూతేశ్వర ' నామము నిర్ణయించారు. మహాపూజ రోజున గణపతిముని అళగమ్మపై ' సౌందర్యాంబా శతకం ' రచించారు.
నిరంజనానందులే ప్రతినిత్యం అమ్మ సమాధివద్ద నిత్యపూజలు చేశేవారు. మరి కొన్నాళ్ళకు ఆసమాధిపై చిన్నకుటీరం నిర్మించి నిరంజనానందులు అందులో వుండసాగారు. భగవాన్ ప్రతిరోజు వాహ్యాళికి సాయంత్రం అక్కడకువచ్చి సమాధివద్ద కొద్దిసేపు గడిపి తిరిగి స్కందాశ్రమానికి వెళ్ళేవారు.
ఒకనాడు వారి జయంతికి వారంరోజుల ముందు, 1922 డిసెంబరులో, భగవాన్ అమ్మసమాధి వద్దకు వచ్చి అక్కడే వుండిపోయారు. చీకటి పడినా భగవాన్ తిరిగిరానందుకు భక్తులు కంగారుపడ్డారు. వారిని తిరిగి స్కందాశ్రమం రమ్మని ప్రార్ధించారు. అప్పుడు భగవాన్ ' ఇక్కడ నన్ను దైవీశక్తి వుండి పొమ్మంటున్నది. ఇక్కడే వుండిపోతాను.' అంటూ ' ఇక్కడికి నా అంతట నేను రాలేదు పరెచ్ఛ వలననే రావడం జరిగింది.' అన్నారు.
వెంటనే, భగవాన్ వున్నచోటే, భక్తులు ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ ప్రదేశమే నేడు ' రమణాశ్రమం ' గా వర్ధిల్లుతున్నది. భగవాన్ ఆనాటినుండి వారు నిర్యాణం అయ్యేవరకు అనగా 1950 ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం రాత్రి గం. 8.47 ని. వరకు అంటే దాదాపు 27 సం. పైగా అక్కడే వుండిపొయ్యారు. సమాధికి యెదురుగావున్న కుటీరంలో భగవాన్ వుండేవారు.
ఆశ్రమం ప్రారంభమైన దినాల్లో భగవాన్ చెయ్యివేసిన తరువాతనే యేపని అయినా మొదలు పెట్టేవారు. భగవాన్ కూడా తెల్లవారు ఝామున 3 గం. లకే లేచి కాలకృత్యాలు తీర్చుకుని శిష్యులతో కలసి కూరలు తరిగేవారు. ఫలహారం సిద్ధం చేసేవారు. మొదట్లో ఇడ్లీ నంచుడుకి పచ్చడి, సాంబారు కూడా వారే స్వయంగా తయారు చేసేవారు. ఆపని వారు చెయ్య వలసిన అవసరం లేకపోయినా, శ్రమ కి వున్న విలువ అందరూ తెలుసుకోవాలనీ, అందరూ శ్రద్ధ చూపించవలసిన అవసరం కోసమే ఆపని చేసేవారు. పదార్ధాలు వృధా కాకుండా వంట చెయ్యాలని చెప్పేవారు. పాకక్రియ యొక్క ప్రాధాన్యత ఎప్పుడూ చెబుతూ వుండేవారు.
రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -15.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
ప్రతిరోజూ ఉదయం 5 గం.లకు క్రమంతప్పకుండా భగవాన్ కూర్చునే హాలు తెరచేవారు, భక్తుల దర్శనార్ధం. స్వామి సమక్షమే ఈశ్వరసందర్శనం లాగా, స్వామి ప్రమేయం లేకుండానే, భక్తులు సాష్టాంగ నమస్కారాలు చెయ్యడము ఉపనిషద్ పారాయణం, ధ్యానం చెయ్యడం జరిగిపోతూ ఉండేవి. ఆశ్రమ నియమాల ప్రకారం స్త్రీలు రాత్రులందు ఆశ్రమంలో వుండకూడదు కావున, బయటనుండి స్త్రీలు ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చేవారు.
ఆరున్నరగంటలకు స్వామి స్నానంముగించి ఫలహారం సేవించి కొండమీదకు వెళ్ళేవారు. మిగిలినవారు తమ దైనందిన పనులు చూసుకునేవారు. అంటే, తోట నుండి పూలు తెచ్చి పూలు కట్టడం, వంటకు కావలసిన సంభారాలు వూరిలోనికి వెళ్లి తేవడం, వంటపని, పశువులను శ్రద్ధగా చూసుకునే పని యిలాంటివి. మరి కొందరు ఆశ్రమకార్యాలయంలో పఠనాలయమ్ నిర్వహణా కార్యక్రమం లో వుండేవారు.
వేదపాఠశాల నిర్వహించేవారు మాతృభూతెశ్వరునికి, దేవి యోగంబకు, స్కందునికి, వినాయకునికి, శ్రీచక్రమునకు, ఆగమవిధి ప్రకారము పూజలు చేశేవారు. పర్వదినాలలో విశేషపూజలు చేసేవారు.
ఎనిమిది గంటలకు స్వామి మరల హాలులో సోఫాలో కూర్చునేవారు. ఎక్కువగా మౌనంగా ధ్యానముద్రలో వుండేవారు. ఆసమయంలో భక్తులు తాము వ్రాసిన స్తోత్రాలు, పాటలు పాడేవారు. కొందరు తమ వాదనా పటిమ స్వామి ముందు ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరేవారు. వారికికూడా మౌనమే స్వామి సమాధానం. ప్రశ్నలు అర్ధవంతమై, అవతల వ్యక్తి జిజ్ఞాసతో కూడినది అయితే సమాధానం ఇచ్చేవారు. చాలా మంది మటుకు స్వామివదనం చూస్తూ ఆత్మవిచారము, ధ్యానము సులభంగా అభ్యాసము చేశేవారు.
ఆవిధంగా కొద్దిసేపు గడిచిన తరువాత, 9 గం. లకు దేశవిదేశాల నుండి వచ్చిన లేఖలకు గణపతిముని వ్రాసిన జవాబులు చూసి, అవసరము అనుకున్న చోట్ల సరిచేసేవారు. తిరిగి భక్తులతో గోష్టి . పదకొండున్నర గంటలకు మధ్యాహ్న భోజనము. ఆపై రెండుగంటలవరకు స్వామి వార్తాపత్రికల చదవడమో, విశ్రమించడం చేశేవారు.
సుమారు రెండున్నర గంటలకు భక్తులందరకూ తేనీరు. మళ్ళీ హాలులో స్వామి కొలువుతీరి సాయంత్రం వరకు దేశవిదేశీ భక్తులతో సత్సంగం. కొందరు సందేహనివృత్తి చేసుకునేవారు. కొందరు స్వామి తేజోవంతమైన కన్నులవైపేచూస్తూ, ఆత్మానందాన్ని అనుభవిస్తుండేవారు. సాయంకాలం 4.30 గం. లకు స్వామి కొండపైకి వెళ్ళేవారు. తిరిగిరాగానే, 5.30 నుండి ధ్యానసమయం. ఈ సమయంలో స్వామి వసారాలో కూర్చుని దర్శనమిచ్చేవారు. చుట్టుపక్కల అనూహ్యమైన ప్రశాంతత. వేదవిద్యార్ధుల నమక చమక పారాయణ, శ్రీ సూక్త పురుషసూక్తాలతో పరిసరాలు మారుమ్రోగిపోయేవి. ఆతరువాత కొద్దిసేపు ఉపదేశసారము, వివిధ పుస్తక పారాయణము. ఆ సమయానికి మాతృభూతేశ్వర పూజ జరిగేది. ఆ తరువాత స్త్రీలు భోజనం చేసి నిద్రించడానికి వూరిలోనికి వెళ్ళేవారు.
స్వామి రాత్రి 7.30 ని. లకు లఘుభోజనము. ఎనిమిదిన్నరవరకు శిష్యుల ఘోష్టి. అనంతరం శిష్యులు నమస్కరించి శలవు తీసుకునేవారు.
ఆహా! యెంత నియమనిష్ఠలతో కూడిన దినచర్య. ఇట్టి దినచర్యలో స్వామితో పాలుపంచుకున్న ఆనాటి భక్తులు యెంతధన్యులో కదా! వారికి జీవన్ముక్తి కలిగింది అనుకోవడంలో అణుమాత్రం సందేహంలేదు. ఈ నాటికీ రమణాశ్రమంలో చరమాంకజీవితం గడుపుతున్న వారి జీవితాలు యెంత ప్రశాంతతను సంతరించుకున్నవో కదా! అట్టి భాగ్యం కలగాలంటే విశేష కరుణ భగవాన్ మనపై ప్రసరించాలి.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -16.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
రమణాశ్రమంలో సంవత్సరంలో 3 రోజులు ఉత్సవదినాలుగా పాటించేవారు. అవి కృత్తికా దీపోత్సవం,
శ్రీరమణుల జయంతి, మాతృభూతేశ్వర మహాపూజాదినం. ఆయా రోజులలో ఆశ్రమం భక్తులతో కోలాహలంగా వుంటుంది.
క్రమక్రమంగా శ్రీరమణుల కీర్తి దేశదేశముల వ్యాపించుటచే పాశ్ఛాత్యభక్తులు కూడా రాసాగారు. వారి ఆధ్యాత్మిక సందేహాలు తీర్చుకునేవారు. భగవానునితో ముఖాముఖి సంభాషణ, వారి దివ్యవాణి ముఖత: వినడము, వారు యిచ్చే అభయము, యెంతో గంభీరమైన తాత్వికవిషయాలనుకూడా హాస్య చతురతతో విపులీకరించడం అన్నిటినీ మించి నిరాడంబరత, కరుణ, సామాన్యుల బాధలకు వారిలో ఒకరిగా స్పందించుట యివన్నీ యావన్మందినీ ఆకర్షించి కట్టి పడవేసేవి, భగవానుని చెంత.
ఆశ్రమం అభివృద్ధిపధంలో వున్నప్పుడు యెవరి మనసుకు క్లేశం లేకుండా భగవానులు నిరంజనానందుల పేర పవర్ ఆఫ్ అట్టార్నీ వ్రాయించి ఆశ్రమ నిర్వహణావిధానం కూడా వీలునామాలో పొందు పరచారు. దాని ప్రకారం ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతో నిరంజనానందుల నిర్వహణలో, వారి అనంతరం వంశపారంపర్యంగా ఆ విధులు నేరవేర్చునట్లు యేర్పాటు జరిగింది.
శ్రీ భగవాన్ ల తమ్ములు ఆ విధంగా 1917 లో అరుణాచలం వచ్చి సన్యసించి నిరంజనానంద స్వామి పేరుతొ ఆశ్రమసేవ చేయుచున్న వారిని 1930 లో ' సర్వాధికారి ' గా నియమించారు. వారుకూడా యెంతో సంయమనంతో ఆ పదవిలో 22 యేండ్లు ఆశ్రమానికి సేవలుచేశారు. ఆ సమయంలో ఆశ్రమం యెంతో అభివృద్ధిచెందింది. 1938లో తమకుమారులైన చిన వెంకటరామన్ ను సహాయకునిగా పిలిపించుకున్నారు.
ఇక భక్తి వ్యాసంగానికి వస్తే, అరుణగిరి ప్రదక్షిణంకి యంతో ప్రాముఖ్యత వున్నది. గిరి ప్రదక్షిణము అనేది భక్తులు 9నెలల గర్భిణీ యేవిధంగా నడచునో ఆవిధంగా చెయ్యవలెనని స్వామి పదేపదే భక్తులకు చెప్పేవారు. ఇది సుమారు 8 మైళ్ళ రహదారి. స్వామి తమతో వచ్చిన భక్తుల వీలుకోసమని ప్రతి మైలుకు ఒకసారి విశ్రాంతి తీసుకునేవారు. ఆసమయంలో వూరిప్రజలు భక్తులకు ఆహారపానీయాలతో విందు చేశేవారు. భజనలతో, నృత్యాలతో వారికి సత్కాలక్షేపం చేసి సేదతీర్చేవారు. స్వామితో కలిసి గిరి ప్రదక్షిణ ఒక అద్భుతఅవకాశంగా భక్తులు భావించేవారు. ఆసమయంలోనే భగవాన్ ఆశువుగా యెన్నోగీతాలు పాడేవారు. ఉపమానాలతో తాత్విక బోధనలు చేశేవారు.
భగవాన్ కూడా భక్తులు యెక్కువగా వుంటే, రహదారి వెంట వెళ్ళేవారు, వారికోసమై. భక్తులు తక్కువగా వుంటే అడవిమార్గంగా వెళ్ళేవారు. ఎప్పుడైనా వంటరిగా వెళితే కొండపాదాన్ని అనుసరించి వెళ్ళేవారు. గిరిప్రదక్షిణకు వున్న మూడు మార్గాలను స్వామి వీలునుబట్టి వుపయోగించేవారు.
ఈ గిరిమహత్యం గురిచి భగవాన్ రమణమహర్షి యిక్కడ యెన్నో ఓషధులు వున్నాయనీ, ఎక్కడబడితే అక్కడ నీటివూటలు వున్నాయనీ, యిది సిద్ధనివాసమని అంటూ వుండేవారు. ఇది యెంత పురాతనమైనదో చెబుతో విదేశీయులు యిక్కడిరాళ్ళను పరీక్షించి ఈ గిరిపర్వతం హిమాలయాలకంటే పురాతనమయినదని తేల్చారని చెప్పేవారు. ఈ అరుణగిరి యెత్తు 2668 అడుగులు, 30 మైళ్ళ వరకు అరుణాచల మండలం గా పురాణాలలో వర్ణింపబడిన విషయం కూడా తెలుస్తున్నది.
రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -17.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
శ్రీరమణులు తిరువన్నామలై వచ్చి సెప్టెంబరు 1వ తేదీ 1946 వ సం. నాటికి 50 వసంతాలు పూర్తి అయినాయి. ఆరోజున భక్తులు యెంతో వైభవంగా స్వామి స్వర్ణోత్సవం ఆశ్రమంలో జరిపారు. ఆరోజు జరిగిన వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ స్వామి శ్రద్ధగా చూస్తున్నట్లు కనబడుతున్నా, సాక్షీ మాత్రంగా చూస్తూ మౌనసందేశం మాత్రమే యిచ్చారు భక్తులకు. అట్టి సమయంలో కూడా మౌనం గా వుండడం సామాన్యులకు వీలుతుందా. ఏదోయేదో చెప్పాలని ఆరాటపడుతారు సహజంగా. కానీ స్వామి పెదవివిప్పి పలుకలేదు ఆరోజంతా.
అదే విధంగా మాతృభూతేశ్వర ఆలయం లో 1949 మార్చిలో అద్భుతంగా కుంభాభిషేకం, యాగములు వంటి బృహత్తర కార్యములలో లక్షలాది భక్తులు పాల్గొంటున్నా శ్రీ భగవాన్ సాక్షిగా వుండి అన్నీ చూస్తూ వింటూ కేవలం శిరస్సు వూపుతూ విచ్చేసిన లక్షలాదిజనులకు తమ కరుణారస ధారలు కురిపించారు.
స్వామికి 1947 వ సం. నుండే ఆరోగ్యం క్షీణించసాగింది. కీళ్ళనొప్పులు వీపు, నడుము కండరాలకి కూడా వ్యాపించాయి. భక్తులు వారిదేహం పడుతున్న బాధలు చూడలేక వైద్యం, మంచి ఆహారం అందించాలని చూడగా స్వామి నిరాకరించేవారు. శరీర వ్యామోహం వారికి ఏనాడైనా వుంటేకదా! 1948 చివరిరోజుల్లో భగవాన్ ఎడమచేతి పైభాగాన, ఒక వ్రణం ఏర్పడింది. రోజురోజుకీ యెదగడం ప్రారంభించింది. 1949 ఫిబ్రవరి నాటికి గోలీకాయంత పరిమాణంలోకి వచ్చింది. శస్త్రచికిత్స చెయ్యాలని ఆశ్రమ వైద్యులు యేర్పాట్లు చేయిస్తుంటే, ' దాని ఎదుగుదల అది చేసుకుంటున్నది. మనకేమి? మనమెందుకు నిరోధించడం ' అని అడ్డుచెప్పారు. అయినా వైద్యులు పట్టుపట్టి దానిని శస్త్రచికిత్స ద్వారా తీసివేశారు. కట్టుకడితే భక్తులకు దండకడియం పెట్టుకున్నానని, నవ్వుతూ చెప్పేవారు.
గాయం తగ్గుతున్నదని అందరూ భావిస్తుండగా, శస్త్రచికిత్స చేసిన పై భాగాన గాయం పెరిగి పెరిగి పెద్దై పుట్టకురుపుగా పరిణమించింది. బాధ తెలియకుండా మత్తుమందు యిద్దామని వైద్యులు ప్రయత్నిస్తే భగవాన్ వొప్పుకోలేదు. అసలు తనకేమీ బాధలేనట్లు శాంతంగా వుండసాగారు. భక్తులు వూరికే ఉండలేక సిద్ధ వైద్యం ప్రయత్నిస్తే, వ్యాధి తగ్గడానికి బదులు పెరుగసాగింది. మద్రాసునుండి ప్రముఖ వైద్యులు డాక్టరు రాఘవాచారిగారు వచ్చి మార్చి 27, 1949న ఆపరేషను చెయ్యాలని నిర్ణయించారు. ఆపరేషను జరిగినా పుండు మానలేదు. ఇంకా పెద్దది అయినది. రేడియం సూదులకుకూడా అది లొంగలేదు. చివరకు దానిని ఏప్రిలు నాటికి ' సర్కోమా ' అనే విషగ్రంధిగా నిర్ణయించి చికిత్స మొదలు పెట్టారు. అయినా పుండు మానకపోగా రక్తంకూడా కారడం మొదలైంది. డాక్టరుగారు భుజం కోసివేయవలసి వస్తుందేమో అన్నారు. భగవాన్ దానికి వప్పుకోక ' ఇదే పుండు తలపై వస్తే, తల కొట్టివేయుదురు కాబోలు ' అని చమత్కరించారు.
ఇక ఆయుర్వేద వైద్యులు ఆకువైద్యం ప్రారంభించారు. కొందరుభక్తులు స్వామి పరిస్థితి చూడలేక ' స్వామీ ! మీరే సంకల్పం చేసి తగ్గించుకొనరాదా ! అంటే, అప్పుడు కూడా ' నేను సంకల్పం చేసి తెచ్చుకున్నానా ! సంకల్పం చేసి పోగొట్టుకొనుటకు. వుండనీయండి దానిని. అది నన్నేమి చేస్తుంది.' అనేవారు.
వైద్యం నడుస్తూ వున్నది.
రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -18.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
రమణులకు వైద్యం నడుస్తూ వున్నది.
పుండుకు యెండతాకితే మంచిదని వైద్యులు స్వామిని గోశాల వెనుక యెండలో కూర్చోబెడితే భక్తులు వారిని చూసి దుఃఖించేవారు. భగవాన్ వారిని యెంతో సరదా వుపమానాలతో తత్వరహశ్యంతో వోదార్చేవారు. ఉదాహరణకు, స్పిరిట్ అనే పదార్ధంతో వారి కురుపును వైద్యులు శుభ్రం చేస్తుంటే, అది దేహంమీద బడితే, స్పిరిట్ అనే పదానికి ఆత్మ అనే అర్ధం జోడిస్తూ ' నేను యిప్పుడు ఆత్మస్నానం చేశాను ' అని నవ్వుతూ చెబుతూ ఆదిశంకరుల ఆత్మబోధ లోని శ్లోకాలతో అన్వయించేవారు. ఇంకొకసారి ' మీరందరూ వచ్చి నా చుట్టూ చేరినట్లే, యిదిగో యీ పుట్టకురుపూ వచ్చి నాభుజంమీద కూర్చుంది. వారిని పొమ్మని అనడం న్యాయంకాదు కదా ! 'అనేవారు. యెంత దేహ పరిత్యాగస్థితి.
ఇంకొకసారి కురుపునుండి బాగా రక్తంకారుతుంటే దానిని సూర్యకాంతమణిగా అభివర్ణి స్తూ, ' ఇది మనకు అలంకారం అయింది. శమంతకమణి పచ్చటిబంగారాన్ని యిస్తే, యిదిగో యిది ఎర్రటి బంగారాన్ని యిస్తుంది ' అని హాస్యంగా అంటూ ఆ బాధను నిర్వికారంగా అనుభవించేవారు.
చెడురక్తాన్ని పీల్చడం కోసం కురుపుకు జలగలను కరిపిస్తే, అవి రక్తం పీల్చిపీల్చి కురుపుకు అంటుకు పోయి వుండేవి. వాటిని కురుపునుండి విడదీసేటప్పుడు వుండేబాధ యే మానవమాత్రుడూ భరించలేడు. అట్టిస్థితిలో కూడా భగవాన్ వైద్యులతో ' ఈజలగలు మహాజ్ఞానులలాగా సమాధిస్థితిలో వున్నాయి ' అంటూ చిరునవ్వుతో చమత్కరించడం వారికే చెల్లింది.
ఒక భక్తుడు భగవాన్ దేహస్థితి చూసి విలపిస్తుంటే, దగ్గరకు తీసుకుని ' ఏమీ దిగులుపడకు. అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. శరీరం నిర్జీవపదార్ధం కదా! ఆత్మఛాయ ఆవరించడం వలన దానిలో చైతన్య క్రియాశక్తి కనబడుతున్నది. స్థూలదేహ భారంతో సూక్ష్మదేహం క్రుంగి పోతున్నది. ' అంటూ తత్వబోధ ఆ శిష్యుడికి చేశారు భగవాన్. ఓం నమో భగవతే రమణాయ !
భగవాన్ ని స్వీయ సంకల్పంతో వ్రణం నయం చేసుకొమ్మని మళ్ళీ భక్తులు పోరుపెట్టసాగారు. ' ఈ శరీరం ఒకటున్నదని, దానికి చేతులున్నవనీ, అందులో వొకదానికి పుండువున్నదనీ, మీరు గొడవచేస్తుంటే, నాకు తోస్తోంది. లేకుంటే నాకేమీ అనిపించడం లేదు. ఇక ఎవరికోసం సంకల్పించుకోవాలి. ' అనేవారు. ' మాకోసం ' అని ఒక భక్తుడంటే, ' సరిసరి. తమరొకరంటూ వేరేవున్నారా యిక్కడ ' అని సమభావం ప్రదర్శించేవారు, నీవు నేను అనే భేదదృష్టి లేని భగవాన్.
అందరూ ఆ వ్రణం గురించి మాట్లాడుతుంటే ' మీరందరూ దానిని అంత గౌరవిస్తున్నారు. అవును అది మణి కదా ! ఆమాత్రం గౌరవం ఇవ్వాలి. ' అని హాస్యమాడేవారు. వైద్యులు చికిత్స పొడిగిస్తుంటే, ' అది యెందుకు వచ్చిందో దానిపని అది చూసుకుంటుంది అని చెబుతుంటే, మీరు వినడం లేదు. కత్తికోతలు మొదలుపెట్టారు. మీ పని యిట్లా వుందా అని బుస్సున పెరిగి మీతో యుద్ధం చేస్తున్నది. చూద్దాం, యెవరు గెలుస్తారో ' అని ఒక మధ్యవర్తిలాగా అనేవారు.
ఈ వైద్యం యిలా నడుస్తూవుండగా, 05.07.1949న ఒక ఆకుకట్ల వైద్యుడు వచ్చి కట్టువేశాడు. అదికూడా గుణం చూపలేకపోయింది. 14వ తారీఖున జ్వరంతో వణుకుతూ కూడా భక్తురాలు శాంతమ్మ శరీరం వణుకుతున్నది అంటే, ' అది నటరాజతాండవం భయమెందుకు ' అని శాంతమ్మను,చుట్టూ వున్న భక్తులను వోదార్చారు. 27వ తారీఖున రక్తస్రావం విపరీతంగా జరుగుతూ వుంటే, ' భగవాన్ మాకు కాకుండా పోతారేమో ' అని భక్తులు కన్నీరు కారుస్తూ వుంటే, ' సరిపోయింది. భగవాన్ లేకుండా యెక్కడికి పోతారు? యెక్కడికి పోగలరు? ' అని ధైర్యం చెప్పారు భగవాన్.
స్వామి ఆరోగ్యం కోసం కొందరుభక్తులు, బ్రాహ్మణులు విశేషపూజలు, సూర్యనమస్కారాలు చేస్తుంటే వద్దనలేదు. పైగా ' పోనీయండయ్యా! మంచిపనేకదా! ధనవంతులకు డబ్బు సద్వినియోగం అవుతుంది. బ్రాహ్మణులకు భోజనం లభిస్తుంది. వద్దంటే వారంతా చిన్నబుచ్చుకుంటారు. ' అనేవారు రమణులు.
ఆవిధంగా యెవరికి తోచినవిధంగా వారు స్వామి ఆరోగ్యంకోసం వైద్యము, ఇతర దైవిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -19.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
రమణులకు వైద్యం నడుస్తూ వున్నది. యెవరికి తోచినవిధంగా వారు స్వామి ఆరోగ్యంకోసం వైద్యము, ఇతర దైవిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
1949 ఆగష్టునెల ప్రారంభంలో భగవాన్కి పెన్సిలిను యింజక్షన్లు ప్రారంభించారు. పారాయణ సమయాలలో తప్ప భక్తులకు భగవాన్దర్శనం నిషేధించారు, వారి విశ్రాంతికోసం. 7వ తారీఖు మూడవ ఆపరేషను చేశారు భగవాన్ కి. వ్యాకులపడుతున్న భక్తుల భయాందోళనలు పోగొట్టడానికి భగవాన్ ఆరోజు సాయంత్రము 6 గం. లకు దర్శనమిచ్చారు. మరునాడు భగవాన్ స్వంతంగానడిచి దర్శనం హాలుకువచ్చారు.
డాక్టర్లు మళ్ళీప్రయత్నాలు మొదలుపెట్టారు, చిగురించినఆశతో. అయితే, పాత దానిపైన యింకొక విష గ్రంధి కనబడసాగింది. డిసెంబరు14న మళ్ళీ ఆపరేషను చేశారు డాక్టర్లు . అయినా గుణం కనబడలేదు. ' రమణజ్యోతి ' ఇంకెన్నాళ్ళు వుంటుందో తెలియని అసందిగ్ధత భక్తులకు. ఆ సమయం లో హోమియో వైద్యంకూడా చేయించారు భగవాన్కి. కొద్దిగా గుణం కనబడసాగింది. స్వామిదర్శనం చిన్న గదిలోనికి మార్చారు, వేదపారాయణం మధ్య. జనవరి 5, 1950 న భగవాన్ 70వ జయంతి జరిగింది . ఉదయం నుండి సాయంత్రందాకా భక్తులసందడిలో భగవాన్ కూడా పాలుపంచుకున్నారు.
ఫెబ్రవరికల్లా మళ్ళీ భగవాన్ కి వ్యాధి తిరగబెట్టింది. వ్రణం క్రిందిభాగాన యింకొకగ్రంధి ఏర్పడింది. హోమియో , ఆయుర్వేదం వైద్యాలు కూడా వికటింపసాగాయి . భగవాన్ శరీరం బలహీనమై రక్తం తగ్గి పోసాగింది. కానీ ఆశ్చర్యం ! స్వామి ముఖంలో కాంతి యేమాత్రం తగ్గలేదు. స్వామి కనబరుస్తున్న ఉత్సాహం వారి హాస్యోక్తులు డాక్టర్లను కూడా అబ్బురపరచసాగాయి.
తరువాత తరువాత ఆకశ్మికంగా భగవాన్ శరీరం యెక్కువ పనిచేసే శక్తి కోల్పోయింది. వారు ఒక చిన్నగదిలో వుండి , భక్తులు ఒక్కరు ఒక్కరుగా వచ్చి చూసి పోతూవుందేవారు. ఆశ్రమ జంతువులైన నెమళ్ళూ , కోతులు, ఆవులు భగవాన్ దర్శనం కోసం తపించిపోయేవి. అక్కడక్కడే తిరుగుతూ వుండేవి . భగవాన్ ప్రేమ తత్వం అనుభవించిన జీవాలు కదా అవి.
చివరిది నాలుగవ ఆపరేషను అయిన తరువాత 17 తారీఖు మార్చి 1950 న స్వామికి వాంతి అయింది. ఆ తరువాత ఆహారమే ముట్టుకోలేదు స్వామి. ఆయన సోదరి వచ్చి పాయసం తినక పోతివే స్వామీ అని విచారం వ్యక్తం చెయ్యగా, ' వీళ్ళు నేను పాయసం తినలేదని విచారిస్తారు. నేనువీళ్ళు యెప్పటికి జ్ఞానమనే పాయసం తాగుతారా అని విచారిస్తాను. ఏది యే విధంగా జరగాలో అలానే జరుగుతుంది. ' అని తను అంత బాధలో వున్నా, భక్తుల గురించి బాధపడేవారు.
భక్తురాలు సూరినాగమ్మ గారు వికృతినామ సంవత్సర ఉగాది ముందురోజు, ఎప్పటిలాగానే, కొత్త తుండుగుడ్డ, కౌపీనము తెచ్చి 18.03.1950 నాడు అక్కడ బల్ల మీద పెట్టి ' రేపు వికృతి నామ సంవత్సర ఉగాది. ' అన్నది. భగవాన్ వులిక్కిపడినట్లు, ' ఓహో ! వచ్చిందీ ఉగాదీ ? వికృతి వచ్చిందీ? ' అని అదొక ధ్వనితో అన్నారు.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -20.

సూరి నాగమ్మగారు ఉగాది రేపే అని చెప్పగానే ' వచ్చిందీ ఉగాదీ? ' అన్న భగవాన్ మాటలకు ' తీరిందీ ఋణం ' అన్నట్లు అనిపించింది సూరినాగమ్మ గారికి. ఆ మాటలు విని ఆమె శరీరం కంపించింది.
మార్చి నెలాఖరులో కలకత్తానుండి ఆయుర్వేదవైద్యుడు వచ్చాడు. భగవాన్ కి క్రమంగా వైద్యం పట్ల విసుగు మొదలైంది. భావగర్భితంగా ' ఎంగిలి విస్తరిని యింకా దాచుకోవడానికి ప్రయత్నిస్తారా యెవరైనా ' అని మాత్రం అన్నారు భగవాన్. ఏప్రిల్ 12వ తేదీ తరువాత నుండి భగవాన్ మందులు, వైద్యానికి విముఖత చూపారు. భక్తులు మందు యివ్వబోతుంటే 'రెండు రోజులలో పోవుదానికి మందెందుకు ' అని మాత్రం అన్నారు. భక్తులు రెండురోజుల్లో రుగ్మత పోతుందని స్వామి అంటున్నారు అనుకున్నారు. కానీ స్వామి భావం వేరు.
స్వామి చివరిశ్వాస వరకు భక్తులకు దర్శనం ఇస్తూనే వున్నారు.
1950 ఏప్రిల్ 14, కృష్ణ పక్ష త్రయోదశి శుక్రవారం నాడు, సాయంత్రం నాలుగుగంటలకు భగవాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దర్శనం నిషేధించే ఉద్దేశ్యంతో స్వామి గదికి తెరవేయగా, కారణం తెలుసుకుని స్వామి, తెర తొలగించమని ఆదేశించి తనపడకను గది ముందుభాగానికి జరిపించుకుని దాని పై కూర్చుండి సాయంత్రం 6గం. వరకు దర్శనం ఇస్తూనే వున్నారు. రాత్రి 8 గం. లకు వైద్యులు ఇక స్వామి యేక్షణంలో నైనా నిర్యాణం చెందవచ్చని వైద్యులు ప్రకటించారు. భగవాన్కి ' అక్షరమణమాల ' అంటే యెంతో ఇష్టమని భక్తులందరూ దానిని గానం చెయ్యడం మొదలు పెట్టారు. ఆ ఘడియ రానే వచ్చింది. రాత్రి 8 గం. 47 ని. లకు కెమెరాలో ఫ్లాష్ వంటి ప్రకాశవంతమైన కాంతితో కూడిన ఒకజ్యోతి భగవాన్ గదిలోనుండి పయనిస్తూ అరుణాచల పర్వతాగ్రానికి చేరి ఆగిపోయింది.
మర్నాడు వార్తాపత్రికలు జ్యోతి పయనించిన విషయం ప్రచురించగా వూరిలోని వారు ఏదో అపాయం శంకించి పరుగుపరుగున ఆశ్రమం చేరుకొని స్వామి నిర్యాణవార్త తెలుసుకున్నారు.
మరునాడు ఉదయం స్వామి పార్ధివదేహానికి వేదఘోషల నడుమ పంచామృతాలతో అభిషేకం చేశారు. అందరూ భగవానుని అమృతదేహం తాకి అంజలి ఘటించారు. మాతృభూతేశ్వరాలయానికి ఉత్తరాన ఒక గొయ్యితీసి అందులో కర్పూరము, ఉప్పు, సుగంధద్రవ్యాలు నింపి మధ్యలో స్వామి శరీరాన్ని వుంచి సమాధి చేశారు. సాయంకాలానికి యీ కార్యక్రమం ముగిసింది
రమణుల అవతారము ఆద్యంతం ఒక జ్యోతిప్రయాణం తో పోల్చవచ్చు. ఒక అంధురాలికి జ్యోతిరూపం లో కనబడి తన అవతారాన్ని ప్రారంభించి తిరిగి జ్యోతిరూపం లో మహాప్రస్థానం ముగింపజేసుకున్న మహనీయులు రమణులు.
1896 సెప్టెంబరు 1 వ తేదీ నుండి, నిర్యాణం వరకు అనగా 1950 ఏప్రిలు 14 వరకు ఒక్కరోజు కూడా అరుణాచలక్షేత్రాన్ని వదలి భగవాన్ రమణులు వుండలేదు. తండ్రి భుజం పైన బిడ్డలా కొంతకాలం కొండమీద, తండ్రి ఒడిలోని బిడ్డలా తదుపరిరోజుల్లో కొండపాదాలచెంత గడిపారు రమణులు.
స్వామి జీవించి వున్నప్పుడే అన్ని చట్టబద్ధమైన యేర్పాట్లు చెయ్యడం వలన ఈ నాటికీ, ఏ విధమైన ఆటంకం లేకుండా స్వామి జీవించి వున్నప్పుడు ఆశ్రమ దినచర్య యేవిధంగా సాగేదో, అదే విధంగా యే మార్పులూ లేకుండా నేటికీ ఆశ్రమ నిర్వహణ సాగుతూ వున్నది.
జీవితం లో ఒక్కసారి అయినా ప్రశాంతంగా యిన్నిరోజులూ మనం మననం చేసుకున్న ప్రదేశాలు తనివితీరా చూసి, రమణుల వెంట మనం ఆశ్రమం లో తిరుగుతున్నట్లు గా భావిస్తూ రమణాశ్రమ దర్శనం చేసుకుని తరిద్దాం. దానికి ఆ భగవాన్ రమణుల అనుగ్రహం కోసం వేడుకుందాం. రమణ అనుగ్రహం వుంటే, జీవిత చరమాంకం లో అక్కడ వుండే ప్రాప్తి కలుగుతుందని ఆశిద్దాం.
ఓం నమో భగవతే రమణాయ!
ప్రియమైన ముఖ పుస్తక స్నేహితులకు : మనం స్మరించుకున్న యీ రమణుల చరిత్ర ఒక విహంగ వీక్షణం మాత్రమే ( A bird's eye view ). సూర్యుడిని అద్దంలో చూపే ప్రయత్నం. వారు మనకందించిన అమూల్య రచనలు, వారు హృద్యంగా స్పందించిన పలుసందర్భాలు, వళ్ళు పులకరించే సంఘటనలు లెక్కకు మిక్కిలి. అవి కూడా వీలు వెంబడి రమణుల అనుగ్రహంతో స్మరించుకుందాము. ఈ ప్రయాణం లో సహరించి స్పందించిన మిత్రులందరకూ రమణానుగ్రహప్రాప్తిరస్తు. తాపత్రయనివారణా సిద్ధిరస్తు.

No comments:
Post a Comment